రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ సెస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ సెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. టీపీసీసీ సభ్యులు నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి అప్రకటిత విద్యుత్ కోతలు నిలిపివేయాలని, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పీసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సెస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి MDకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వ్యవసాయ రంగానికి త్రీఫేస్ కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయోమయానికి గురి చేసిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్రమైన వరి సాగు జరుగుతుంది. వరి సాగుకు నీరు అవసరాన్ని బట్టి రైతులు వ్యవసాయ మోటార్లకు ఆటోమెటిక్ స్టార్టర్లు పెట్టుకున్నారు.
అయితే ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తోందని, మీకు ఆటోమేటిక్ స్టార్టర్లలు అవసరం లేదని విద్యుత్ శాఖ అధికారులు వాటిని తొలగించారు. ఇప్పుడు 24 గంటలు కాకపోయినా కనీసం నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తు కూడా అందించడం లేదంటూ దుయ్యబట్టారు. కనీసం రెండు మూడు గంటల నిరంతర విద్యుత్ కూడా అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. విద్యుత్ అందించే సమయంలో నిలకడమైన వ్యవస్థ లేనందున రైతులు తమ సొంత పనులు మానుకొని కరెంటు వచ్చే సమయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని, రాత్రి వేళలో విద్యుత్తు అందించడం వల్ల పొలాల్లోకి వెళ్లే రైతులు పాముకాట్లకు గురవుతున్నారని, పలు సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతున్నారని ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళు తెరవాలని సూచించారు.
ఈ అప్రకటిత విద్యుత్ కోతలతో భూములు నెర్రలు పారి పంటలు పండే పరిస్థితి ఉందన్నారు. దీంతో రైతులు పెట్టుబడి భారాన్ని మోయవలసి వస్తుందన్నారు. వ్యవసాయ బావుల్లో, బోర్లలో నీరు ఉన్నప్పటికీ విద్యుత్తు అందలేక పంటలు పండించలేని దుస్థితిలో రైతులు ఉన్నారు. అందుచేత ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం వ్యవసాయం కోసం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత నాణ్యమైన త్రీ ఫేస్ కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే.. రాష్ట్ర రైతాంగంతో కలిసి హైదరాబాద్ లోని విద్యుత్ సౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆకునూరి బాలరాజ్, కుస రవీందర్, కాముని వనిత, జిల్లా కార్యవర్గ సభ్యులు sk గౌస్, తాటి ప్రభాకర్, చిలుక రమేష్, జడ్పీటీసీ నాగం కుమార్, పట్టణ మండల అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, జాలగం ప్రవీణ్, ఏళ్ల బాలరెడ్డి, దొమ్మటి నర్సయ్య, హమీద్, ఫిరోజ్ పాషా ,చింతపంటి రామస్వామి, పాసుల వెంకన్న, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, సర్పంచ్ ప్రదీప్, కిసాన్ సెల్ కార్యవర్గం మర్రి శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల పర్శారములు, మోహన్ రెడ్డితో పాటు జిల్లా, మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాగా వికారాబాద్ జిల్లా పరిగిలో కూడా రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలంటూ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.