ప్రైవేట్ స్కూల్ బస్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన రాజన్న సిరిసిల్లలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సును వెనక నుంచి అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో 15 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజ్ఙాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు అల్మాస్పూర్, రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరిగి సిరిసిల్లకు వస్తుండగా.. ఎల్లారెడ్డిపేట సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మలుపు వద్ద ఆర్టీసీ బస్సు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది.
దీంతో స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులు ఒకరి మీద ఒకరు పడి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్కూల్ యజమాని ఎంబీ లతీఫ్ విద్యార్థులను వెంటనే స్థానిక అశ్విని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
కాగా ఆర్టీసీ బస్సు అతి వేగంతో దూసుకు వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టిందని ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు తెలిపారు.