రెండోదశ పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లి గ్రామంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వస్తున్న సమయంలో రంగారెడ్డి గూడా వద్ద రైల్వే గేట్ పడటంతో ఆయన కాన్వాయ్ ఆగింది. ఇదే సమయంలో రంగారెడ్డి గూడా గ్రామంలో పోల్యూషన్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలంటూ సిఎస్ సోమేష్ కుమార్ ను గ్రామస్తులు అడ్డుకోవాలని యత్నించారు. ఐతే ముందుగానే గ్రామస్తులకు కలెక్టర్ రోనాల్డ్ రోస్ సర్ది చెప్పారు. దీంతో కొంత మంది గ్రామస్తులు సీఎస్ వద్దకు చేరుకుని తమ గ్రామాన్ని సందర్శించాలని కోరారు. దీంతో గ్రామస్తుల కోరిక మేరకు రంగారెడ్డి గూడ గ్రామంలో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు తమ గ్రామ శివారులోని ఐరన్ ఫ్యాక్టరీ ద్వార కాలుష్యం వస్తుందని.. దీంతో తమకు అనారోగ్యాలు తలెత్తుతున్నాయని తెలిపారు. అనంతరం సీఎస్ గుండ్లపొట్ల పల్లి గ్రామానికి బయలు దేరారు.