మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చింది హనుమాన్ జంక్షన్ సినిమా. రీసెంట్ గా 20 ఏళ్ల ఉత్సవం కూడా జరుపుకుంది ఈ సినిమా. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ ఒకటి బయటకొచ్చింది. ఈ సినిమాలో అర్జున్, జగపతిబాబు హీరోలుగా నటించారు. కానీ నిజానికి వీళ్ల కంటే ముందు మోహన్ బాబు, రాజశేఖర్ ను ఈ పాత్రల కోసం అనుకున్నాడు దర్శకుడు మోహన్ రాజా.
ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మోహన్ రాజా ఈ విషయాన్ని బయటపెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ల స్థానంలో అర్జున్, జగపతిబాబును తీసుకున్నామని తెలిపాడు. ఇప్పుడా అనివార్య కారణమేంటో బయటపెట్టాడు హీరో రాజశేఖర్. హనుమాన్ జంక్షన్ సినిమాను తను కావాలనే వదులుకున్నానని ప్రకటించాడు ఈ హీరో.
“హనుమాన్ జంక్షన్ సినిమాను నేను కావాలనే మిస్ చేసుకున్నాను. ఆ సినిమాలో మోహన్ బాబును, నన్ను హీరోలుగా అనుకున్నారు. నేను అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. కానీ మరో హీరో మోహన్ బాబు అని నాకు చెప్పలేదు. మోహన్ బాబు అని తెలియగానే నా అడ్వాన్స్ తిరిగిచ్చేశాను. చేయనని చెప్పేశాను. ఎందుకంటే, షూటింగ్ 9కి అంటే నేను 10కి వస్తాను. మోహన్ బాబు మాత్రం 9కే ఠంచనుగా వచ్చేస్తారు. దాంతో మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చెడిపోతుంది. అందుకే నేను చేయనని చెప్పాను.”
ఇలా అసలు కారణాన్ని బయటపెట్టాడు రాజశేఖర్. శేఖర్ సినిమా ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. రాబోయే రోజుల్లో ఎవరైనా మంచి విలన్ పాత్రలతో సంప్రదిస్తే కచ్చితంగా చేస్తానని అంటున్నాడు ఈ సీనియర్ హీరో.