సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలని చర్చించారు. దళిత బంధు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగాలు, ఇతర ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాలని బండి సంజయ్ వారికి సూచించారు.
ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసినా.. పట్టుబట్టి ప్రజలకు అనుకూలంగా ఒత్తిడి తీసుకు రావాలన్నారు బండి. టీఆర్ఎస్ సర్కార్ పై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు టీఆర్ఎస్ పార్టీ సమావేశాలుగా మార్చేస్తున్న కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పేలా బీజేపీ వాదన ఉండాలన్నారు. ప్రజాపక్షంగా ప్రజల ఆవేదనను సమావేశాల్లో వినిపించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. టీఆర్ఎస్ నియంతృత్వ ధోరణిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఎప్పటికీ బీజేపీదేనన్న బండి… కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారు.