హైదరబాద్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ ముందు అయ్యప్ప స్వాముల ధర్నాకు దిగారు. కొడంగల్ సభలో ఎంఆర్పీఎస్ నాయకులు అయ్యప్ప స్వామిని కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
అయ్యప్ప స్వాముల శక్తి చూపిస్తామని.. తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో హిందూ దేవతలను కించపరిచిన వారిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంఐఎం జోకరులైన తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరారు. హిందూ దేవతలని దూషించిన వ్యక్తిపై పీడీ యాక్ట్ పెట్టే దమ్ము ఉందా? అని అడిగారు.
తనపై అన్యాయంగా పీడీ యాక్ట్ నమోదు చేశారన్నారు రాజాసింగ్. ఇప్పుడు హిందూ దేవతలని కించపరిచిన వారినిపై కూడా అదే చర్యలు తీసుకుంటారా? అని నిలదీశారు. లేని పక్షంలో తెలంగాణలోని లక్షలాది మంది అయ్యప్ప స్వాములతో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అయ్యప్ప స్వామిని దూషించిన బైరి నరేష్ పై గురుస్వామి వీరేందర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని మాదన్నపేట్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. వెంటనే అరెస్ట్ చేయకపోతే భారీ ఎత్తున సైదాబాద్ ప్రధాన రహదారిపై నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.