బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపై స్పందించారు. సీఎం కేసీఆర్ కు సైలెంట్ గా చురకలంటించారు.
కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్నారు రాజాసింగ్. ఇది రెండు రోజులు హడావుడి చేసి వదిలేయొద్దని.. డ్రగ్స్ కొనేవారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలన్నారు.
ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ కు తన మద్దతు ఉంటుందన్నారు రాజాసింగ్. ఏదైనా డ్రగ్స్ వ్యవహారం బయటపడినప్పుడు రెండు రోజులు హడావుడి చేసి వదిలేస్తోంది ప్రభుత్వం. అందుకే రాజాసింగ్ ఇలా స్పందించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు.
ఆదివారం ఉదయం బంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. యజమాని సహా 144 మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్ లో కొందరు ప్రముఖుల పిల్లలు ఉన్నారు. వారి వివరాలు నమోదు చేసుకున్న అనంతరం వదిలేశారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.