మొరాయిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కార్ ను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రగతి భవన్ ముందు వదిలి వెళితే.. ఇప్పుడు వేరే మోడల్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు ఆయన ఇంటి ముందు తెచ్చిపెట్టారు. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు రాజాసింగ్ వాహనాన్ని మార్చినట్లైంది.
అయితే ఎన్నో సార్లు తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చండని ఆయన ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా పట్టించుకోలేదు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై తరుచూ సీఎంకీ, డీజీపీకి లేఖ రాస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎన్ని సార్లు విన్నవించిన ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఇటీవల ఆయన ప్రగతి భవన్ ముందు వాహనాన్ని వదిలేసి వెళ్లారు.
ఇక దీంతో ఈ సారి 2010 మోడల్ వాహనం కాకుండా.. 2017 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం ఎమ్మెల్యే రాజా సింగ్ కు కేటాయించింది. అయితే దీనిపై ఆయన స్పందించారు. ప్రస్తుతం తాను శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు బయలుదేరానని..తెలుపు రంగు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని పోలీసులు తన ఇంటి వద్దకు తెచ్చి పెట్టారని చెప్పారు.
తాను ఇంటికి వెళ్లాక ఆ వాహనం ఎలా ఉందో చూడాలని.. దాని కండిషన్ ఎలా ఉందో చూస్తానని పేర్కొన్నారు. కొత్త కారే తనకు కావాలని లేదని..మంచి కండిషన్ ఉన్న బుల్లెట్ వాహనం ఇస్తే తనకు అదే చాలని ఆయన స్పష్టం చేశారు.