ఐఫోన్ 13 ప్రీ ఆఫర్.. అందరికి కాదండోయ్.. కేవలం ప్రజాప్రతినిధులకు మాత్రమే. అదేంది అనుకుంటున్నారా..? అది అంతే మరి. ఎప్పుడు ఏదో ఒక సర్ ప్రైజ్ గిప్ట్ లతో అలరించే రాజస్థాన్ ప్రభుత్వం.. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ 13 ఫోన్ ఆఫర్ చేసిందట. వాటి ఖరీదు ఒక్కోటి రూ.75 వేల నుంచి లక్ష వరకు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం గతంలోనూ ప్రభుత్వ నిధులతో ఎమ్మెల్యేలకు ఖరీదైన ఆపిల్ ఐప్యాడ్స్, ల్యాప్‌టాప్స్ అందజేసి విమర్శల పాలైనట్టే ఇప్పుడు అదే తరహాలో విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.
రాజస్థాన్ సీఎం బుధవారం 2022-23 సంవత్సరానికి గాను ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, పర్యాటకం వంటి రంగాలపై ప్రధానంగా దృష్టి సారించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు 3 గంటల పాటు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేశారు.
పట్టణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇందిరా గాంధీ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. దీని కోసం రూ. 800 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించామన్నారు. కాగా.. 2004 జనవరి 1న లేదా ఆ తర్వాత నియమితులైన ఉద్యోగులందరికీ వచ్చే ఏడాది నుంచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు సీఎం.