భార్యను గర్భవతి చేసేందుకు ఒక ఖైదీకి కోర్టు 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. గర్భం దాల్చడం, సంతానం పొందడం మహిళ హక్కు అని, దానిని తాము కాదనలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజస్థాన్‌కు చెందిన రాహల్(25) అనే వ్యక్తి మైనర్ ను అపహరించి అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
అతని భార్య తాను గర్భవతిని కావాలనుకుంటున్నట్లు కోర్టులో పిటిషన్ వేయగా జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్‌జైన్ తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. రూ.2 లక్షలతో వ్యక్తిగత పూచీకత్తు సహా రూ.లక్ష చొప్పున రెండు ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని ఖైదీకి స్పష్టం చేసింది.
ఖైదీ జైలు శిక్ష కారణంగా అతడి భార్య సంతానం పొందే హక్కును కోల్పోయిందని కోర్టు అభిప్రాయపడింది. ఎలాంటి నేరం చేయని ఆమె భావోద్వేగమైన, లైంగికపరమైన ఆ హక్కును కోల్పోవడం భావ్యం కాదని ధర్మాసనం పేర్కొంది.
అలాగే మహిళ సంతాన హక్కుకు సంబంధించి ఋగ్వేదంతో సహా పలు హిందూ గ్రంథాలను హైకోర్టు ఉదాహరించింది. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం సిద్ధాంతాలను కూడా కోర్టు ప్రస్తావించింది. 16 మత కర్మలలో బిడ్డను కనడం స్త్రీకి మొదటి హక్కు అని ధర్మాసం నొక్కి చెప్పింది.