కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్రలో అపశ్రుతి ! రాజస్తాన్ లో మంగళవారం యాత్ర సాగుతుండగా .. హఠాత్తుగా ఓ డ్రోన్ కెమెరా .. ప్రతాప్ సింగ్ ఖచారియావాస్ అనే మంత్రి భుజాలపై పడింది. దీంతో గాయపడిన ఆయన మధ్యలోనే యాత్రను విరమించుకున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తున్నానని, మూడు, నాలుగు రోజులు యాత్రలో పాల్గొనలేనని ఆ తరువాత ట్వీట్ చేశారు. తిరిగి ఈ నెల 10 న రాహుల్ పాదయాత్రలో పాల్గొంటానన్నారు.
ఈ యాత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. రఘువీర్ సింగ్ మీనా అనే మరో నేత కూడా నిన్న యాత్ర సందర్భంగా స్వల్పంగా గాయపడి ఆసుపత్రి పాలై జలావర్ లోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఈ హాస్పిటల్ ను సందర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
బీజేపీకి పట్టు ఉన్న జలావర్ లో నిన్న రాహుల్ యాత్ర సాగుతూ ఈ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఆయనను చూసి.. కావాలనే ‘మోడీ.. మోడీ’ అని నినాదాలు చేశారు. అయితే రాహుల్ వాటిని పట్టించుకోకుండా వారికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.
పైగా వారికి విష్ చేస్తూ.. తన వెంట ఉన్న మంత్రి రామ్ లాల్ జాట్ ని, పార్టీ నేత సచిన్ పైలట్ ని కూడా తనలాగే వారికి విష్ చేయాలని కోరారు. బీజేపీ కార్యకర్తలకు తాను అభివాదం చేస్తున్న ఫోటోను ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ.. ద్వేషానికి, ఆగ్రహానికి ఇక్కడ తావు లేదని, ప్రజల మధ్య ప్రేమాభిమానాలే ఇండియాను సమైక్యంగా ఉంచుతాయని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ నా ఆప్యాయతను పంచుతానన్నారు.