ఐపీఎల్ 2022 సీజన్ లో అద్భుతమైన ఆటతో అన్ని టీమ్ లు అదరగొడుతున్నాయి. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి పోరాడుతున్నాయి. తాజాగా.. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చెలరేగిపోయింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను నిలుపుకుంది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 18.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 161 పరుగులు చేసి ఘనవిజయాన్ని అందుకుంది.
బుధవారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ఛేజ్ చేయడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 160 పరుగులు చేసింది. ఆ తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ గా వచ్చిన శ్రీకర్ భరత్ (0) జట్టు ఖాతా తెరవకముందే అవుటైనప్పటికీ.. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ క్రీజులో పాతుకుపోయి చెలరేగిపోయారు.
ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 144 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డేవిడ్ వార్నర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా అర్ధ సెంచరీ (52) పరుగులు చేయగా.. మిచెల్ మార్ష్ 5 ఫోర్లు, 7 సిక్సర్లు అదరగొట్టి 89 పరుగులు సాధించాడు. మార్ష్ అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ 4 బాల్స్ ఆడి.. 13 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఢిల్లీ 12 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకుంది. ఓడిన రాజస్థాన్ 14 పాయంట్లతో నాలుగో స్థానంలోనే ఉంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగు చేసి అలరించాడు. పడిక్కల్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుటయ్యాడు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, నార్జ్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ మెరిసిన మార్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్ లో నేడు చెన్నై-ముంబై జట్లు తలపడతాయి.