‘ఈ సాలా కప్ నమ్డే’.. ఐపీఎల్ లో బెంగళూరు ఫేమస్ డైలాగ్ ఇది. అప్పు రేపు అన్నట్లు.. ప్రతీ సీజన్ లో కప్పు మనదే అనే ఈ డైలాగ్ తో వేల మీమ్స్ కనిపిస్తుంటాయి. మొన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై గెలిచాక.. ఫైనల్ కు వెళ్లేది బెంగళూరేనని అంతా అనుకున్నారు. కానీ.. రాజస్థాన్ లో హిట్లర్ లాంటి బట్లర్ ను తక్కువ అంచనా వేశారు ఆర్సీబీ ఫ్యాన్స్. క్వాలిఫయర్ 2లో ఒంటిచేత్తో రాజస్థాన్ రాయల్స్ ను విజయతీరాలకు చేర్చాడు.
ముందుగా టాస్ గెలిచి ఆర్ఆర్.. ఆర్సీబీని బ్యాటింగ్ కు పిలిచింది. కీలక మ్యాచ్ లో నిలబడతాడని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఫ్యాన్స్ ను మరోసారి నిరాశపరిచాడు కోహ్లీ(7). డుప్లెసిస్(25), మాక్స్ వెల్(24) పర్వాలేదనిపించారు. లూమ్రర్(8), దినేష్ కార్తీక్(6) చేతులెత్తేశారు. మొన్నటి మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన పాటిదార్(58) మరోసారి నిలబడ్డాడు. అతడి వల్లే ఆర్సీబీ 150 పరుగులను దాటించింది.
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 157 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ నుంచి జైశ్వాల్(21), బట్లర్(106 నాటౌట్) దిగారు. 5 ఓవర్ల దాకా వికెట్ పడకుండా ఆడుతూ వచ్చారు. బట్లర్ కు జైశ్వాల్ సపోర్ట్ గా నిలబడడంతో బట్లర్ చెలరేగిపోయాడు. సిక్సులు, ఫోర్లతో ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్నాడు. ఆరో ఓవర్ లో జైశ్వాల్ ఔట్ కాగా సంజూ శామ్సన్(23) దిగాడు. కాసేపు నిలబడ్డాడు. తర్వాత పాడిక్కల్(9) తక్కువ స్కోర్ కే వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. బట్లర్ బాదుడు కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలోనే 19వ ఓవర్ తొలి బంతికే విజయతీరాలకు చేరింది ఆర్ఆర్. ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
Advertisements
ఈ విజయంతో ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది రాజస్థాన్ రాయల్స్. ఇటు ఆర్ఆర్ విజయంలో కీలక భూమిక పోషించిన బట్లర్ కు ఈ సీజన్ లో ఇది నాలుగో సెంచరీ. మే 29న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. గుజరాత్ టీమ్ తో రాజస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని ప్రచారం జరుగుతోంది.