• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Opinion » ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇంట్లో పెళ్లి వైభోగాల ఖర్చు భరించిన కంపెనీ ఏది?!

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇంట్లో పెళ్లి వైభోగాల ఖర్చు భరించిన కంపెనీ ఏది?!

Last Updated: January 28, 2022 at 2:38 pm

(ది న్యూస్ మినిట్ అనే సుప్రసిద్ధ ఇంగ్లిష్ వార్తా వెబ్ సైట్ ప్రత్యేక పరిశోధనాత్మక కథనంగా పాల్ ఊమెన్ రాసిన ఈ కథనాన్ని ఇవాళ మధ్యాహ్నం ప్రచురించింది. తెలంగాణ బిడ్డలు తెలుసుకోవలసిన విషయాలెన్నో ఉన్న ఈ కథనాన్ని తెలుగు చేసి ప్రచురించడానికి న్యూస్ మినిట్ అనుమతి తీసుకున్నాను – ఎన్ వేణుగోపాల్)

వందలాది మంది అతిథులు, హైదరాబాద్ లోని అగ్రశ్రేణి హోటళ్లలో ఎన్నో విందులు, అత్యంత విలాసవంతమైన తాజ్ ఫలక్ నుమా పాలెస్ లో భారీ విందు. ఇటీవల జరిగిన తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కూతురు అంజలీ కుమార్ అయిదురోజుల పెళ్లి రాజోచితంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహా వైభవపు వివాహపు ఖర్చులో ప్రధానమైన భాగాన్ని బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే నిగూఢ కంపెనీ భరించిందని ది న్యూస్ మినిట్ చేసిన ఒక వివరమైన పరిశోధనలో ఇప్పుడు బైటపడింది.

ఆ కంపెనీ చిరునామా వెతుకుతూ వెళితే హైదరాబాద్ పాత నగరంలోని బహదూర్ పురా ప్రాంతంలోని ఒక ఇంటికి చేరాం. అక్కడికి ఎందుకొచ్చామో, ఆ కంపెనీ ఏమిటో తెలియక గందరగోళపడిన ఒక పెద్ద వయసు స్త్రీ మాకక్కడ కనిపించింది. ఆ ఐదు నక్షత్రాల పెళ్లి ఖర్చు భరించిన కంపెనీ రిజిస్టర్డ్ చిరునామా తన ఇల్లు ఎందుకయిందో కూడా ఆమెకు కచ్చితంగా తెలియదు. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మూలం వెతుకుతూ పోగా ది న్యూస్ మినిట్ కు దొరికిన పత్రాల ప్రకారం హైదరాబాద్ లోని ఒక బడా ప్రభుత్వ కాంట్రాక్టర్ కంపెనీ ఉన్నతోద్యోగుల దగ్గరికి చేరాం. ఆ కంపెనీ పేరు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. 2021 డిసెంబర్ 17 నుంచి 21 దాకా అయిదు రోజుల పాటు అత్యంత విలాసవంతమైన ఎన్నో చోట్ల జరిగిన ఈ మహా వివాహ సంరంభపు పథకంలో ఆ ఉద్యోగులు సన్నిహితంగా పాల్గొన్నారని తెలిసింది.

మేఘా ఇంజనీరింగ్ అంటే తెలంగాణలో భారీగా నిర్మాణమవుతున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన చాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కంపెనీ. ఆ ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతానికి విపరీతమైన రు. ఒక లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలుగా ఉంది. దేశం మొత్తంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రాజెక్టుల్లోకెల్లా అత్యంత ఖరీదైనదిగా ఈ ప్రాజెక్టు పేరు పొందింది. అసలు కొన్ని నివేదికలైతే ఇది ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఎత్తిపోతల పథకం అని అభివర్ణిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ భారీ విద్యుత్ సబ్ స్టేషన్లనూ, ట్రాన్స్ మిషన్ లైన్లనూ నిర్మిస్తున్నది.

ఇంకా చెప్పుకోదగిన విషయమేమంటే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షించే రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ శాఖకు అధిపతిగా రజత్ కుమార్ పనిచేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకూ ఆ పనులను పర్యవేక్షిస్తున్న ప్రధానాధికారికీ మధ్య ఉన్న అనధికార సంబంధాన్ని బహిర్గతపరిచే పత్రాలు ఔచిత్యం గురించిన తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

వివాహానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగిన, వివాహ అతిథులు బస చేసిన తాజ్ గ్రూప్ హోటళ్లయిన తాజ్ కృష్ణా, తాజ్ దక్కన్, తాజ్ ఫలక్ నుమా లను సంప్రదించడం, బుకింగ్ చేయడం, వివాహ సంరంభాల ఖర్చుల చెల్లింపులు జరపడం వంటి అన్ని పనులూ మేఘా ఉన్నతోద్యోగులే చేశారని ది న్యూస్ మినిట్ దగ్గర ఉన్న పత్రాలు వెల్లడిస్తున్నాయి.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూతురి పెళ్లికి సంబంధించిన ఈ వేర్వేరు కార్యక్రమాల ప్రణాళికలను హోటళ్ల సిబ్బందితో చర్చించేటప్పుడు ఆ కంపెనీ ఉద్యోగుల్లో కొందరు తమ కంపెనీ ఇమెయిల్ ఐడీలనే వాడారు. కొందరు ఇందుకోసమే ఒక డమ్మీ ఇమెయిల్ ఐడీని సృష్టించారు.

అయితే ఆ దొంగ ఐడీ నుంచి రాసిన ఉత్తరాల్లో కూడా కంపెనీ ఉద్యోగి తన అసలు పేరునే వాడారు. మొదట్లో ఆ డమ్మీ ఇమెయిల్ ఐడీని వాడినప్పటికీ, తర్వాతి దశల్లో తమ కంపెనీ మెయిల్ ఐడీ వాడిన మేఘా ఉద్యోగులకూ హోటల్ సిబ్బందికీ మధ్య చాల ఉత్తరాలు నడిచాయి.

మాకు తెలిసిన విషయాలు: “పరోక్షంగా” మేఘా ఎలా జోక్యం చేసుకుంది?

పెళ్లి రోజులను ముందస్తుగా బ్లాక్ చేయడానికి, బాంక్వెట్ హాళ్లకూ, గదులకూ సంబంధించిన బుకింగ్ చేస్తూ 2021 జూలై 31న ‘బుకింగ్స్ హైదరాబాద్’ అనే జీమెయిల్ ఐడీ నుంచి హోటళ్లకు ఇమెయిల్ వచ్చింది. ఆ ఇమెయిల్ మీద మురళి అని సంతకం ఉంది. ఆ తర్వాత కె మురళితో పాటు మేఘా కంపెనీ ఉద్యోగి టి ప్రమీలన్ బుకింగ్ లను, ఇన్వాయిస్ లను, చెల్లింపులను నిర్వహించారు.

మేఘాకు చెందిన మురళి బుక్ చేసినవి ఇవి – డిసెంబర్ 17 మధ్యాహ్న భోజనం కోసం అల్ ఫ్రెస్కో లాన్, హై టీ కోసం లగ్జరీ స్వీట్, రాత్రి భోజనం కోసం చాంబర్స్ లాన్. డిసెంబర్ 18న బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ల కోసం గార్డెన్ రూమ్, లంచ్ కోసం అల్ ఫ్రెస్కో లాన్. అదే విధంగా తాజ్ కృష్ణా లోని ఇతర స్థలాలను డిసెంబర్ 19, 20, 21 లలో భోజనాల కోసం బుక్ చేశారు. ఈ బుకింగ్ లన్నిటినీ డిసెంబర్ 13న ఖరారు చేశారు.

హోటళ్ల వారితో మేఘా కుదుర్చుకున్న మొదటి ఒప్పందం ప్రకారం మొత్తం ఖర్చు దాదాపు యాబై లక్షల రూపాయలు. ది న్యూస్ మినిట్ సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఇన్వాయిస్ లన్నిటినీ రెండు కంపెనీల పేరు మీద ఇమ్మని అడిగారు. అవి ఒకటి, ఇంటరాక్టివ్ డాటా సిస్టమ్స్, రెండవది బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండో కంపెనీని 2021 జూన్ లోనే స్థాపించారు. మొదటి కంపెనీ అయిన ఇంటరాక్టివ్ డాటా సిస్టమ్స్ డైరెక్టర్లు మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థల బోర్డులలో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు.

అయితే ఆ ఇన్వాయిస్ ల చెల్లింపుల సమయం వచ్చేసరికి మేఘాతో సంబంధం ఉన్న కంపెనీ వెనక్కి తగ్గింది. బాకీగా మిగిలిన 23 లక్షల రూపాయలను బిగ్ వేవ్ చెల్లించాల్సిందిగా చూపారు.

ఈ బుకింగ్ లకు సంబంధించిన మొదటి సంప్రదింపులు స్వయంగా రజత్ కుమార్ చేశారని న్యూస్ మినిట్ కు సమాచారం అందింది. ఆ తర్వాత, అన్ని ఏర్పాట్లనూ మేఘా ఇంజనీరింగ్ కు చెందిన ఇద్దరు ఉన్నతోద్యోగులతో పాటు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా ఉన్న ప్రభాకర్ రావు చూసుకున్నారని న్యూస్ మినిట్ కు సమాచారం ఇచ్చినవారు నిర్ధారించారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ డిసెంబర్ 20న తన కూతురికీ అల్లుడికీ, ఇతర అతిథులకూ మొత్తం 70 మందికి అత్యంత విలాసవంతమైన తాజ్ ఫలక్ నుమా లో విందు ఇచ్చారు. ఆ విందు కోసం ఒక్కొక్క అతిథికీ రు. 16,520 చొప్పున చెల్లించారు.

తాజ్ ఫలక్ నుమా లో 101 మంది ఒకేసారి కూచుని భోజనం చేయగలిగే భోజనాల బల్ల అత్యంత ప్రత్యేకమైనది. అది అత్యంత సంపన్నులూ శక్తిమంతులూ మాత్రమే ఉపయోగిస్తారు. అక్కడే ప్రభుత్వం అతి ముఖ్యమైన ప్రభుత్వ అతిథులకూ, ప్రముఖులకూ విందులు ఇస్తూ ఉంటుంది. అక్కడ కూచుని భోజనం చేస్తున్న ఫొటోలను రజత్ కుమార్ కూతురు, ఇతర కుటుంబ సభ్యులు సోషల్ మీడియా మీద కూడా పంచుకున్నారు. ఈ అతి ఖరీదైన విందులో ఇరు వైపుల కుటుంబాల సభ్యులూ పాల్గొన్నారు. ఈ మొత్తం ఖర్చును బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ భరించింది.

అసలీ బిగ్ వేవ్ ను ఎవరు నడుపుతారు?

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కూతురి వివాహ కార్యక్రమాల ఖర్చులు భరించిన ఈ రెండు కంపెనీల వివరాల కోసం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సమాచారం చూస్తే, ఇంటరాక్టివ్ డాటా సిస్టమ్ అనే కంపెనీని 2010 జూన్ లో స్థాపించారని తెలిసింది. ఆ కంపెనీకి సుమలత పురిటిపాటి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు, వెంకట సుబ్బా రెడ్డి పురిటిపాటి డైరెక్టర్ గా ఉన్నారు. కృష్ణవేణి చింతపల్లి అదనపు డైరెక్టర్ గా ఉన్నారు. మేఘా గ్రూపుకు చెందిన ఎన్నో ఇతర కంపెనీలలో కూడా వీరు డైరెక్టర్లుగా ఉన్నారు.

ఇక ఎవరెవరు ఎంత చెల్లించారు అనే సూక్ష్మమైన వివరాలు మాత్రం ఇంకా తెలియవలసే ఉంది.

రజత్ కుమార్, మేఘా ఇంజనీరింగ్ ల ఖండన

బుకింగ్ ల కోసం బిగ్ వేవ్ అనే కంపెనీ రు. 23 లక్షలు చెల్లించిందని మా విలేఖరి దగ్గర ఆధారాలున్నాయని, దీని గురించి తాను ఏం చెపుతారని రజత్ కుమార్ ను న్యూస్ మినిట్ ప్రశ్నించగా, ఆయన దాన్ని పూర్తిగా ఖండించారు. “అది తప్పు. నేనసలు ఆ బిగ్ వేవ్ అనే కంపెనీ గురించే ఇంతవరకూ వినలేదు” అన్నారాయన. ఆయన కూతురి పెళ్లి విషయంలో మేఘా ఇంజనీరింగ్ ఉన్నతోద్యోగులు హోటళ్లతో ఎందుకు సంప్రదింపులు జరిపారనీ, బుకింగ్ లు ఎందుకు చేశారనీ, కార్యక్రమాలను ఎందుకు సమన్వయం చేశారనీ అడిగినప్పుడు, “మేఘా ఇంజనీరింగ్ ఏ ఒక్క బుకింగ్ చేయలేదు, ఏ సమన్వయం చేయలేదు. నేనే ఫోన్ చేసి బుకింగ్ చేశాను” అని ఆ ఐఏఎస్ అధికారి అన్నారు.

మేఘా ఇంజనీరింగ్ లో అసోసియేట్ మేనేజర్ గా పనిచేస్తున్న కె మురళి ఈ వివాహపు బుకింగ్ లను, ఏర్పాట్లను ఎందుకు సమన్వయం చేశారని కనుక్కోవడానికి మేఘా ఇంజనీరింగ్ ను కూడా న్యూస్ మినిట్ సంప్రదించింది. మేఘా ఇంజనీరింగ్ పబ్లిక్ రిలేషన్స్ జనరల్ మేనేజర్ ఎం శివప్రసాద్ రెడ్డి ఆ విషయం కనుక్కొని జవాబు చెపుతామన్నారు. ఆ తర్వాత జనవరి 24 సాయంత్రం ఆయన బెంగళూరులోని న్యూస్ మినిట్ కార్యాలయానికి కూడా వచ్చారు. కాని మా కథనానికి తమ వైపు నుంచి స్పందన చెప్పలేదు. ఆయన అన్నదల్లా, మా దగ్గర ఉన్న పత్రాలు నకిలీ సృష్టి అనీ, ఆ వివాహంతో తమ కంపెనీకి ఏ సంబంధమూ లేదని మాత్రమే.

ఒక ప్రభుత్వాధికారి కూతురి పెళ్లికి ఒక ప్రైవేట్ కంపెనీ చెల్లింపులు జరపడం మీద తమ స్పందన ఏమిటని తాజ్ గ్రూప్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ శాంతలా జైన్ ను న్యూస్ మినిట్ అడగగా, “దీని మీద మేం ఏమీ వ్యాఖ్యానించ దలచుకోలేదు. మా క్లైంట్ల సమాచారాన్ని మేం బైట పెట్టబోం” అన్నారు.

రజత్ కుమార్ గతంలో 2019లో కూడా వార్తలకెక్కారు. ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి మేలు చేసినందుకు గాను, ఆయనకు ఆ పార్టీ భూమి కట్టబెట్టిందని కల్పిత పత్రాలు కొన్ని సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. అలా ప్రచారంలోకి వచ్చిన పత్రాలు తప్పుడువనీ, ఆ నిందా ప్రచారం మీద తాను హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాననీ ఆ తర్వాత ఆయన స్పష్టం చేశారు.

తాజా కలం:
మా వార్తా కథనం ప్రచురించిన నాలుగు నిమిషాల తర్వాత మేఘా ఇంజనీరింగ్ మా పరిశోధన మీద తన స్పందనను పంపింది:

తన స్పందనలో మేఘా ఇంజనీరింగ్ మా వ్యాసంలో పేర్కొన్న కంపెనీలతో తమకు ఏ సంబంధమూ లేదని అంది. ఎవరయినా తమ “వ్యక్తిగత స్థాయి”లో చేసిన పనులను కంపెనీకి ఆపాదించగూడదని కూడా అంది. “మీరు మా పేరు ప్రస్తావించిన వ్యవహారాలకు మేఘా ఇంజనీరింగ్ కు బాధ్యత లేదు. అటువంటి వ్యవహారాలు జరిగాయని ఒక కంపెనీగా మాకు తెలియదు. అటువంటి వాటితో మాకు సంబంధం లేదు” అని కంపెనీ తెలిపింది. “మీరు మీ ఇమెయిల్ లో ప్రస్తావించిన కార్యక్రమంతో మేఘా ఇంజనీరింగ్ కు ఎటువంటి సంబంధమూ లేదు. ఒక వ్యక్తి చేశాడంటున్న పనులను కంపెనీకి ఆపాదించడానికి వీలులేదు” అని కూడా కంపెనీ అంది.

(వార్తాకథనంలో ప్రస్తావించిన అన్ని అంశాలనూ రుజువు చేయడానికి తగిన పత్రాలు ది న్యూస్ మినిట్ దగ్గర ఉన్నాయి)

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

సినిమాల‌ను త‌ల‌పించే జులూం..!

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

ట్రైన్ జర్నీ చేస్తున్నారా…? ఆ యాప్ ఉండాల్సిందే

భ‌క్తుల‌కు ప్ర‌వ‌చ‌నాలు..!

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన!

జీతాలివ్వ‌డానికి డ‌బ్బులు లేవు..!

కుడి చేతితో ఇవ్వ‌డం.. ఎడ‌మ చేతితో లాక్కోవ‌డం..!

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఎవరికి తెలియదు..!

దశాబ్దం చివరి నాటికి 6జీ సేవలు

ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ ఆఫర్..!

జైలు కథ కంచికేనా..? అవినీతిపై చర్యలు.. ఉడుత ఊపులేనా!!

కుదిరితే కేసులు.. లేకుంటే దాడులు..!

ఫిల్మ్ నగర్

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య... పట్టించుకోని శృతిహాసన్?

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)