రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత సినిమాలే లోకంగా బతికేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. కుర్రహీరోల కంటే స్పీడుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమా చేస్తున్న రజనీకాంత్, ఆ మూవీ సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ప్రకటించారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జై భీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
అనిరుద్ రవిచంద్రన్ రజనీకాంత్ 170వ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. ఇంతకుముందు సూపర్ స్టార్ నటించిన పేట, దర్బార్ సినిమాలకు ఇతడే సంగీత దర్శకుడు.
జి.కె.ఎం. తమిళ్ కుమరన్ నేతృత్వంలో ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారు. జై భీమ్ తరహాలోనే బలమైన సందేశంతో ఈ సినిమా రాబోతోంది. కాకపోతే రజనీకాంత్ స్టైల్, మార్క్ కూడా ఉంటాయి. సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.