సరిగ్గా 41 ఏళ్లక్రితం ఒకరు సినీ ప్రొడ్యూసర్. మరొకరు సాధారణ బస్ కండక్టర్. ఇప్పుడు సీన్ రివర్స్. అలనాటి ప్రొడ్యూసర్ మొన్నటి దాకా ఇల్లు లేని కామన్ మేన్. ఆనాటి సాధారణ కండక్టర్ నేడు సినీ సూపర్ స్టార్. కానీ గతం గుర్తుంది. చేయూత ఇచ్చిన మహానుభావుడి మేలు మరచిపోని మంచి మనసుంది. ఇల్లు లేని సినీ విధాతను గృహస్తును చేసిన ఔదార్యమిది.
ఒక సాధారణ బస్ కండక్టర్ శివాజీ రావ్ రజనీకాంత్ గా మారి సూపర్ స్టార్ కావడానికి 1978లో భైరవి ద్వారా హీరోగా తొలి అవకాశం ఇప్పించిన నిర్మాత కలై జ్ఞానం చేసిన మేలును ఎంత ఎత్తుకు ఎదిగినా మరిచిపోలేదు. ఆగస్టు 14న కలై జ్ఞానం సన్మాన సభలో ఆయన ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని తెలుసుకున్న రజనీకాంత్ తప్పనిసరిగా ఇల్లు కొనిస్తానని మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారం ఏడాది తిరక్కుండానే కలై జ్ఞానంకు చెన్నైలో ఇల్లు కొని ఇచ్చారు.
అంతేకాదు దసరాకు ముందు రోజు రజనీకాంత్ ఆధ్వర్యంలో గృహప్రవేశం కూడా జరిగింది. రజనీకాంత్ స్వయంగా జ్యోతి వెలిగించి నిర్మాత కలై జ్ఞానం కుటుంబంలో ఆనంద జ్యోతులు ప్రసరింపజేశారు.
కోటి రూపాయలతో ఇల్లు కొనిచ్చిన రజినీకాంత్ తనను హీరోగా చేసిన కలై జ్ఞానం కుటుంబ సభ్యులతో ముచ్చటించి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఇలా ఎందరు చేసిన మేలును గుర్తుంచుకుంటారు. ఎంతైనా సూపర్ స్టార్ రజనీకాంత్ నిజంగా గా సూపర్.