తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక చేశారు. ఆయన పేరు, ఫోటోలను వాణిజ్య ప్రకటనల్లో అనుమతి లేకుండా వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రజనీకాంత్ తరపు న్యాయవాది సూచించారు. ఇదే విషయంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇకపై తమ అనుమతి లేకుండా పేరును గానీ, ఫొటోలను గానీ ఎవరైనా వాడుకుంటే చర్యలు తీసుకుంటామంటూ రజినీకాంత్ తరపు లాయర్ సుబ్బయ్య పబ్లిక్ నోటీసులు ఇచ్చారు. దశాబ్దాలుగా సూపర్ స్టార్ రజినీకాంత్ పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు.
అలాంటి వ్యక్తి ప్రతిష్టకు లేదా వ్యక్తిత్వానికి ఏదైనా నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లతో పాటు కంపెనీలు.. రజినీకాంత్ పేరు, వాయిస్, ఫోటోలతో పాటు ఇమేజ్ ని ఉపయోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, జనాలను ప్రలోభపెట్టేందుకు ఇవి వినియోగిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఇక నుంచి ఎవరైనా వ్యక్తిగత, వ్యాపార అవసరాలు సహా ఎందులో అయినా ఆయన అనుమతి లేనిదే వినియోగిస్తే.. నోటీసులు ఇస్తామన్నారు రజనీకాంత్ తరపు న్యాయవాది.