భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. 2020 సెప్టెంబర్ 1న ఆయన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
అంతకు ముందు భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర శనివారం సాయంత్రం పదవీ విరమణ చేశారు. రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టిన ఫోటోలను ఎన్నికల సంఘం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన బీహార్, జార్ఖండ్‌లలో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పలు మంత్రిత్వ శాఖల్లో పని చేశారు. సామాజిక రంగం, పర్యావరణం, అడవులు, మానవ వనరులు, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో పని చేసిన అనుభవం ఉంది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్‌ను కేంద్రం ఈ నెల 12న నియమించింది. ఆయన నియామకం 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించడం ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం. 2024 లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయన పర్యవేక్షణలో జరగనున్నాయి.