–మేడారానికి వచ్చే భక్తులు ముందుగా వేములవాడ రాజన్న ఆలయానికి
–రాజన్నను దర్శించుకుంటేనే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం
–వన దేవతల తాతగా రాజన్న
–అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో వేములవాడ రాజన్న ఆలయం ఒక్కటి. ఈ ఆలయం భక్తులతో ఎప్పుడు రద్దీగా ఉంటోంది. ఇప్పుడు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. మేడారం జాతర సందర్భంగా వనదేవతల దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో రెండు నెలలుగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర ఈ నెల 16న ప్రారంభం కానుంది.
మూడు రోజులు జరిగే వన దేవతల జాతర కుంభమేళాను తలపిస్తోంది. రద్దీ ఎక్కవగా ఉండటంతో జాతరకు వచ్చిన భక్తులు ముందస్తుగా దర్శనాలు చేసుకుంటున్నారు. దీంతో వేములవాడలో రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగిపోయింది. ఇక్కడి దర్శనానికి వచ్చిన భక్తులు ఇంటిల్లిపాది కోడెను పట్టుకుని ఆలయంలో ప్రదక్షిణ చేసి కోడెను కట్టేసి మొక్కులు సమర్పించుకుంటున్నారు. మేడారంలో వనదేవతలకు బెల్లాన్ని బంగారంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
సాధారణ సమయాల్లో రాజన్న దర్శనానికి ఆది, సోమ, శుక్రవారాల్లో సుమారు 20 నుండి 30 వేల మంది వస్తుంటారు. మేడారం జాతర సందర్భంగాద జనవరి నుంచి రోజుకు లక్షల్లో వస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. మేడారం జాతర నేపథ్యంలో రాజన్నకు భారీగా ఆదాయం సమకూరింది. ఆలయంలోని హుండీలు నిండిపోతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు హుండీలు లెక్కించారు ఆలయ అధికారులు. తాజాగా హుండీలు నిండిపోవడంతో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల హుండీలు మంగళ, బుధవారాలు రెండ్రోజుల పాటు లెక్కించారు.
ఈ సందర్భంగా రూ.5.47 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాకుండా 107.370 గ్రాముల బంగారం, 12.50 కిలోల వెండి వచ్చినట్టు వెల్లడించారు. దర్శనాలు, కోడెమొక్కులు, కొబ్బరి కాయలు, ప్రసాదాల విక్రయాలు, వసతి గదుల అద్దెల ద్వారా మరింత ఆదాయం రానుందని అధికారులు స్పష్టం చేశారు.
మేడారం, వేములవాడ పుణ్యక్షేత్రాల మధ్య తరతరాల అవినాభావ సంబంధం ఉంది. రాజన్నను వనదేవతలు సమ్మక్క-సారలమ్మ లకు తాతగా భావించేవారట. తాత మాటలు వింటూ ఆయన చూపిన బాటలో నడిచేవారని అక్కడి ప్రజలు నమ్ముతారట. అందుకే మేడారం వచ్చే భక్తులు రాజన్నను దర్శించుకుని వస్తేనే భక్తుల కోరికలు నెరవేరుస్తూ వరాలిస్తామని వన దేవతలు చెప్పినట్లు ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడలోని రాజన్నను దర్శనం చేసుకుని వస్తుంటారని అక్కడి గిరిజన ప్రజలు చేప్తున్నారు.