అమరవీరుల భార్యలపై రాజస్తాన్ పోలీసుల దురుసుతనంపట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కి ఫోన్ చేసి ఈ ఉదంతంపై ఆరా తీశారు. 2019 లో పుల్వామా దాడిలో మరణించిన సైనికుల భార్యల్లో ముగ్గురిపట్ల రాజస్తాన్ పోలీసులు ఇటీవల అమానుషంగా ప్రవర్తించారు.
తమకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, దీనిపై ముఖ్యమంత్రిని కలుసుకుని తమ డిమాండును ఆయన దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు తమను జుట్టు పట్టుకుని కొట్టి ఈడ్చుకుంటూ వెళ్లారని బాధిత వితంతువులు విలపించారు. ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
ఈ సమాచారం తెలుసుకున్న రాజ్ నాథ్ సింగ్.. దీనిపై గెహ్లాట్ కి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయమై కనుక్కుని సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకుంటామని గెహ్లాట్..ఆయనకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత , మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ..బాధిత మహిళలను కలుసుకుని వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
వీరిపట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీరి డిమాండ్ల పట్ల సానుభూతిగా స్పందించి వాటిని తీర్చాలని ఆయన సీఎం గెహ్లాట్ కు లేఖ రాశారు. పుల్వామా దాడిలో మృతి చెందిన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా నిబంధనలను సడలించాలని బాధితులు కోరుతున్నారు.