సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన పోలీసుల కాల్పుల్లో చనిపోయిన దామెర రాకేష్ ది సాధారణ మరణం కాదని.. కేంద్రం చేసిన హత్య అని మండిపడ్డారు ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్. తన చావుకు కారణం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అని రాకేష్ మరణవాంగ్మూలం ఇచ్చాడని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు తెలంగాణ డీజీపీకి ఆయన వినతిపత్రం అందజేశారు. భారత సాక్షాదారాల చట్టం 1872 లోని 32(1) సెక్షన్ కింద రాజనాధ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ డీజీపీ ని కోరారు. రాకేష్ మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజనాథ్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయని విరుచుకుపడ్డారు.
రాకేష్ అంతిమ యాత్రలో జాతీయ జెండాకు బదులు టీఆర్ఎస్ పార్టీ జెండాలు పెట్టడం సిగ్గు చేటని మండిపడ్డారు జడ్సన్. టీఆర్ఎస్ కార్యకర్త అంతిమ యాత్రలో పెట్టినట్టు గులాబీ జెండాలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో వరంగల్ కు చెందిన బోడ సునీల్ తన మరణ వాంగ్ములంలో సీఎం కేసీఆర్ పేరు చెప్పాడని.. రెండు నెలల క్రితం ఖమ్మం జిల్లాలో సాయి గణేష్ మంత్రి పువ్వాడ అజయ్ పేరు చెప్పి చనిపోయాడని.. అయినప్పటికీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా డీజీపీ దృష్టి సారించి వారిపై కేసులు నమోదు చేసి.. వారి మరణాలకు ఒక సార్ధకత దక్కేలా చేయాలని కోరారు జడ్సన్.