లాఠీ చేతిలో ఉంటే చాలు.. ఎవరిని పడితే వారిని ఏమైనా చేసే లైసెన్స్ వచ్చినట్టే రెచ్చిపోతున్నారు తెలంగాణలో పోలీసులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తరచూ ఏదో ఒక చోట పోలీసులు .. అమాయకులపై రెచ్చిపోతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అలా తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి ఎస్సై బాగోతం వెలుగులోకి వచ్చింది.
కర్నూలు పాతబస్తీకి చెందిన లక్ష్మణ్ తన స్నేహితుడితో కలిసి వ్యక్తిగత పనిమీద రాజోలుకు వెళ్లాడు. ఈక్రమంలో మాంసం కొనుక్కుని, దాన్ని తినేందుకు పట్టణ శివారులో పొదల్లోకి వెళ్లి కూర్చున్నారు. అటువైపుగా వెళ్తున్న రాజోలి ఎస్సై లెనిన్ , అతని సిబ్బంది వారిని వద్దకు వచ్చి దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా లక్ష్మణ్‌ని తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. అతని తలను ఇన్నోవా కారు వెనుక ఉన్న అద్దానికి వేసి బలంగా కొట్టాడంతో అద్దం విరిగిపోయింది. ఎందుకు తమను కొడుతున్నారని ఎదురు తిరగడంతో.. లక్ష్మణ్‌పై ఐపీసీ 332,353,504 సెక్షన్ ప్రకారం తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేశాడు. లక్ష్మణ్ మద్యం సేవించి కార్ అద్దాలను పగలకొట్టినట్టుగా మీడియాలో ప్రచారం చేయించాడని ఆతని స్నేహితుడు ఆరోపిస్తున్నాడు.
మరోవైపు లక్ష్మణ్ తాగి ఉన్నాడని పోలీసులు చెప్పడాన్ని అతని కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. మానసిక వ్యాధులతో బాధపడుతున్న లక్ష్మణ్ మందులు వాడుతున్నాడని, ఏ విధమైన ఆల్కహాల్ అలవాటు లేకపోయినా తప్పుడు కేసులు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు.రాజోలి ఎస్సై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.