పవన్ కల్యాణ్ సమాజాన్ని విచ్ఛిన్న పరిచే, విభజించే శక్తిలాగా మారుతున్నారన్నారు పవన్ కల్యాణ్ సన్నిహితుడు రవితేజ. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో చేశానని, మరెంతో చేద్దామనుకున్నానని రవితేజ వెల్లడించారు. కానీ, తన ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా పవన్ వెళ్తున్నారని విమర్శించారు. పార్టీ బాగు కోసం చేసిన ఆలోచనల్ని ఆయన ఒక్కసారి కూడా అమలు చేయలేదని వాపోయారు. పవన్ వైఖరి మునుపటిలా లేదని.. అందుకే పార్టీని వీడినట్టు వెల్లడించారు.
అంతకు ముందు విడుదల చేసిన ఓ ప్రకటనలో రవితేజ పవన్ కల్యాణ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పవన్‌లో వివేకం చచ్చిపోయిందని.. మనిషి నాశనం వివేకం నశించడంతోనే మొదలవుతుందని అన్నారు. ఒకప్పుడు పవన్ జీవితంలో ఙ్ఞానం, పాండిత్యం, హృదయంలో మంచితనం దయ, కరుణ ఉండేవని, ఇప్పుడు అవేవీ కాకుండా.. కుట్ర, మోసపు, అబద్ధపు, ద్వేషం నిండాయని చెప్పారు.
‘ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజా జీవితంలోకి ప్రవేశించామో మీరే ఆ వ్యాధిగా మారారు. నాకు ఇష్టం లేకపోయినప్పటికీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా.. పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా ఉండమని మీరు కోరారు. దాదాపు 12 ఏళ్లు మీ వెన్నంటే నడిచాడు. పార్టీకి సంబంధించి అన్ని విషయాల్లో మీతో చర్చించాను. పార్టీ కోసం ఎంతో చేశాను. మరెంతో చేద్దామనుకున్నాను. కానీ, మీ రాజకీయాలు విషపూరితంగా మారాయి. హద్దుల్లేని అబద్ధాలతో మీ వ్యక్తిగత అహంకారాన్ని సంతృప్తి పరుచుకుంటున్నారు. మీరు చేసే ప్రసంగాలు అబద్ధాలు, అసభ్యకర భాషతో ఉంటున్నాయి. మీరెప్పుడూ ధర్మవంతమైన మనిషిగా కాలేరు. ఒక మంచి మనిషి నుంచి నిజాయితీలేని, కుట్రపూరితమైన మనిషిగా మీరు మారారు’అని రాజు రవితేజ పేర్కొన్నారు.