రైతులను వ్యాపారులు అడ్డంగా దోచుకుంటున్నారు. వారికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా దగా చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. 512 కిలోల ఉల్లిని విక్రయించిన రైతుకు.. ఓ వ్యాపారి కేవలం రెండు రూపాయలకు మాత్రమే చెక్కు ఇచ్చాడు. మిగిలిన డబ్బులు కావాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందేనని చెప్పాడు. ఈ ఘటన సోలాపూర్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. సోలాపూర్ మార్కెట్ కమిటీలో రాజేంద్ర తుకారాం చవాన్ అనే రైతు 10 బస్తాల ఉల్లిపాయలను విక్రయించాడు. 512 కిలోల ఉల్లిని విక్రయించగా 512 రూపాయలు వస్తాయని భావించాడు. కానీ 509 రూపాయల ఖర్చు తీసివేసి రూ.2.49 వస్తాయని బిల్లును వ్యాపారి రైతుకు ఇచ్చాడు. అందులో రెండు రూపాయలకు చెక్కు ఇచ్చి.. మిగిలిన డబ్బు 15 రోజుల తర్వాత ఇస్తానని చెప్పాడు. ఈ ఘటనపై స్థానిక రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
కాగా ఈ విషయంపై స్వాభిమాని షెట్కారీ సంఘం అధ్యక్షుడు రాజుశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. రైతుకు వ్యాపారి ఇచ్చిన బిల్లును ఫొటో తీసి షేర్ చేస్తూ.. ‘గవర్నర్లారా.. కాస్త సిగ్గుపడండి.. మీరు రైతులకు ఎలా బతకాలో చెప్పండి. ఒకవైపు రైతుల కరెంటు కనెక్షన్ కట్ చేయడం మూలాన కళ్ల ముందే పంట కోతకు గురవుతోంది.
సోలాపూర్ మార్కెట్ కమిటీలో ఉల్లిపాయల బస్తాలు.. విక్రయిస్తే రైతుకు వ్యాపారి రెండు రూపాయల చెక్కు ఇచ్చాడు. అలా ఇవ్వడానికి మీకు సిగ్గు ఎలా అనిపించలేదు. 15 రోజుల్లో ఈ చెక్కు క్లియర్ అవుతుందని ఆ వ్యాపారి రైతుకు చెబుతున్నాడు’ అంటూ రాజుశెట్టి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు సదరు వ్యాపారిని ఏకి పారేస్తున్నారు.