రాజ్యసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. సభలో గందరగోళం నేపథ్యంలో సమావేశాలను మార్చి 13కు వాయిదా వేశారు. ఈ రోజు సభ మొదలు కాగానే అదానీ స్టాక్స్ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై జేపీసీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలో ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో సభను మొదట 11.50 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ప్రసంగంలో కొన్ని భాగాలను తొలగించడాన్ని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
ఈ అంశంపైన కూడా సభలో రచ్చ జరిగింది. కొందరు ఎంపీలు ఎంపీలు వెల్‌లోకి దూసుకు వెళ్లారు. ఎంపీలు రాఘవ చడ్డా, సంజయ్‌సింగ్, ఇమ్రాన్ ప్రతాప్‌గిరి, శక్తి సింగ్ గోహిల్, సందీప్ పాఠక్, కుమార్ కేట్కర్‌లు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభకు అంతరాయం కలిగింది.
ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ… రాజ్యసభ చైర్మన్ ఒత్తిడిలో పని చేస్తున్నారని ఖర్గే అన్నారని ఆయన చెప్పారు. ఈ పదాలను రికార్డుల నుంచి తొలగించామన్నారు. అనంతరం సభను మార్చి 13కు వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు.