తెలంగాణ రాష్ట్రంలో 52 శాతం జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి బడ్జెట్ లో రూ.6,225 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. 2023-24 బడ్జెట్ లో బీసీ సంక్షేమం కోసం నిధులను రూ.20 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులతో గురువారం మంత్రి గంగుల కమలాకర్ చాంబర్ ను ముట్టడించారు.
అనంతరం ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ లో కొత్త స్కీములు ఏమీ లేవన్నారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి, బడ్జెట్ లో కేటాయింపులకు పొంతనే లేదన్నారు.
పెరిగిన ధరల ప్రకారం స్కాలర్ షిప్ లు, మెస్ ఛార్జీలు పెంచే ప్రస్తావన కూడా లేదన్నారు. బీసీ కార్పోరేషన్ లో 12 బీసీ కుల ఫెడరేషన్ లకు పెండింగ్ లో ఉన్న 5 లక్షల 47 వేల దరఖాస్తులకు రుణాలు ఇవ్వడానికి ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఏవని నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ బీసీ సంక్షేమానికి ఏ మూలకు సరిపోదని అందువల్ల బీసీ బడ్జెట్ రివైజ్ చేయాలని రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.