దేశంలో నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీ సునాయాస విజయాన్ని సాధించింది. మరి కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు గట్టి పోటీనిచ్చాయి.
మరి కొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే రూలింగ్ పార్టీగా లోక్ సభలో బీజేపీకి తిరుగులేని మెజార్టీ ఉండగా, తాజాగా విజయాలతో రాజ్యసభలోనూ మెజార్టీని పొందింది. దీంతో రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడం బీజేపీకి మరింత సులువుగా మారింది.
మహారాష్ట్రలోని 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కర్ణాటకలోని 4 స్థానాలకు గాను మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. హర్యానాలో ఒక స్థానాన్ని కైవసం చేసుకోగా, స్వతంత్ర్య అభ్యర్థి కార్తికేయ బీజేపీ మద్దతులో గెలిచారు.
మరోవైపు మహారాష్ట్ర అధికార మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా మూడు స్థానాల్లో బీజేపీ విజయాన్ని కైవసం చేసుకుంది. హర్యానాలో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కు షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థి చేతిలో మాకెన్ ఓడిపోయారు. ఇక్కడ మరో స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.
ఇక కర్ణాటకలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, లెహర్ సింగ్ సిరోయాలు గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి జయరామ్ రమేశ్ గెలుపొందారు. వీరితో పాటు నటుడు జగ్గేశ్ కూడా విజేతగా నిలిచారు.