అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ స్టేషన్లో జరిగిన విధ్వంసకాండ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.
ఈ ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఘటనలో ఆందోళనకారులు రాళ్లు రువ్వగా.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు చనిపోగా.. అతణ్ని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దబీర్ పేటకు చెందిన రాకేశ్‌గా గుర్తించారు. ఆర్మీలో చేరాలనేది అతడి చిరకాల కోరికగా మృతుని తల్లిదండ్రులు చెప్తున్నారు.
రాకేశ్ తండ్రి కుమార స్వామి గ్రామంలో తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో పంట పండిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రాకేశ్ సోదరి సంగీత పశ్చిమ బెంగాల్ లో బీఎస్ఎఫ్ జవాన్ గా పని చేస్తున్నారు. ఆమె స్ఫూర్తి, ప్రోత్సాహంతో తాను కూడా సైన్యంలో చేరాలని రాకేశ్ భావించాడు. అందుకోసమే తీవ్రంగా శ్రమించాడు. రాకేశ్ హెయిర్‌స్టయిల్ బట్టి.. అతడికి ఆర్మీలో చేరడం అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.
అందులో భాగంగానే రాకేష్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఇంతలో చెలరేగిన విధ్వంసకాండలో భాగంగా సికింద్రాబాద్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేష్ మరణించాడు. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులు అతడి కుటుంబీకులకు తెలిపారు. దీంతో రాకేష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
రాకేష్ తల్లిదండ్రులను పోలీసులు సికింద్రాబాద్ తీసుకెళ్లారు. రాకేష్ మృతితో దబీర్ పేటలో తీవ్ర విషాదం అలుకుముంది. సికింద్రాబాద్ లో జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామానికి చెందిన లక్కం వినయ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ప్రస్తుతం అతడికి గాంధీ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.