స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ ఝంఝన్ వాలాకు చెందిన విమానయాన సంస్థ ‘ ఆకాశ్ ఎయిర్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. దాని ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫోటోలను సంస్థ ట్వీట్ చేసింది.
మరో ట్వీట్ లో ‘ త్వరలో మేము మీ ఆకాశంలోకి వస్తున్నాము’ అని క్యాప్షన్ పెట్టింది. ఇప్పుడు ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అతి తక్కువ ధరల్లో విమానయానం చేసేందుకు తాము కూడా ఎదురు చూస్తున్నామని నెటిజన్లు చెబుతున్నారు.
ఈ ఏడాది జూలై నాటికి కమర్షియల్ విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ను గతేడాది అక్టోబర్ లో కేంద్రం విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
ఇప్పటికే తమ ఎయిర్ లైన్ కోడ్ క్యూపీ అని సంస్థ వెల్లడించింది. ‘ఎయిర్ లైన్స్ ప్రారంభ తేదీ సమీపిస్తోంది. జూన్ నాటికి మా మొదటి ఎయిర్ క్రాఫ్ట్ ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాము. జూలై నాటికి పూర్తి స్థాయిలో కమర్షియల్ సేవలు ప్రారంభించాలని అనుకుంటున్నాము’ అని సీఈవో వినయ్ దూబే తెలిపారు.