వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య జరుగుతున్న చర్చల్లో.. కేంద్ర మంత్రులు వ్యవహరించే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్. ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలకు హాజరయ్యే ఆయన అక్కడ ఏం జరుగుతుందో ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
చర్చలకు హాజరయ్యే మంత్రులకు అసలు ఏమీ తెలియదన్నారు తోకాయిత్. అధికారులు కాగితాలపై రాసి ఇచ్చినవే మంత్రులు తమతో చెప్పేవారని తికాయిత్ ఆరోపించారు. నిజం చెప్పాలంటే అసలు అక్కడ వాస్తవ ప్రభుత్వమే లేదు. ఇతరులు చెప్పిందే కేంద్ర మంత్రులు చెప్పేవాళ్లు. ప్రతిసారీ చాయ్ కోసమని లోపలికి వెళ్తారు. అంతకుముందు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకొని వచ్చేవాళ్లు. ప్రతిసారీ ఇలాగే జరిగేది. ఎప్పుడూ వ్యవసాయ మంత్రి మాత్రమే మాట్లాడేవారు. పీయూష్ గోయల్ ఏదో మాట్లాడాలి కాబట్టి రెండు, మూడు ముక్కలు మాట్లాడే వారు తికాయిత్ చెప్పుకొచ్చారు.