పరిహారం కోసం ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు రైతులు. ఆదిలాబాద్ లోని పిప్పల్ కోటి రిజర్వాయర్ కి భూమిని ఇచ్చినందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో భూనిర్వాసితుల రైతులు ఎడ్లబండ్లతో కలెక్టరేట్ ను ముట్టడించేందుకు బయలుదేరారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. కానీ రైతులు వెనక్కి తగ్గలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కొన్ని ఎడ్లబండ్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తూ ర్యాలీకి అనుమతిచ్చారు.
నాలుగేళ్లు గడిచినా అధికారులు పరిహారం ఇవ్వడం లేదని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులకు ఎకరాకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని, కానీ ఇంకా వందల ఎకరాలకు పరిహారం పెండింగ్ లో ఉందని తెలిపారు.
1.47 టీఎంసీ కెపాసిటీతో చెనక కొరటా బ్యారేజీకి అనుసంధానంగా రిజర్వాయర్ నిర్మాణం కాగా.. అందు కోసం అధికారులు దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని సేకరించారు.