హైదరాబాద్ లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలు.. మహిళలు ఇంటి నుండి బయటకు రావాలంటేనే భయపడేలా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ మైనర్ బాలిక అత్యాచార ఘటనను నిరసిస్తూ.. బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ర్యాలి నిర్వహించారు.
మైనర్ బాలిక అత్యాచారం కేసును హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి తెలంగాణ చౌరస్తా వరకు న్యాయవాదులు ర్యాలీగా బయలుదేరారు. నేరం చేసిన నిందితులను వదిలిపెట్టి.. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతూ కేసును పక్క దారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ లింగమయ్య గౌడ్.
రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం నోరుమెదపడం లేదని విమర్శించారు. తమ పార్టీ నేతల పిల్లల అస్తం ఉండటంతో నేరస్థులను కేసు నుండే తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అనంత రెడ్డి, ఎస్ లక్ష్మారెడ్డి, సీనియర్ న్యాయవాదులు అంజయ్య, గోపాల్, శ్రీనివాసులు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, మల్లారెడ్డి, శివ కుమార్, రాజశేఖర్ రెడ్డి, సాహితీ తదితరులు పాల్గొన్నారు.