కొన్నాళ్ల కిందట ఊహించని కాంబినేషన్ సెట్ అయింది. రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా ప్రకటన వచ్చింది. ఈ డిఫరెంట్ కాంబినేషన్ చూసి చాలామంది ఆడియన్స్ ఎక్సయిట్ అయ్యారు. సినిమాపై అంచనాలు కూడా పెంచుకున్నారు. ఇలా ప్రకటనతోనే అంచనాలు పెంచిన రామ్-బోయపాటి ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైంది.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ మూవీని.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, మరో నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ క్లాప్ ఇచ్చారు.
తన ప్రతి సినిమాకు చేసినట్టుగానే.. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించాడు. దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు.
‘అఖండ’ సినిమా తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా ఇదే. దర్శకుడిగా ఆయనకు ఇది 10వ సినిమా. హీరో రామ్ కు ఇది 20వ సినిమా. ‘ది వారియర్’ తర్వాత రామ్ నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్, ఇతర నటీనటుల్ని ఇంకా ఫిక్స్ చేయలేదు.