మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శిల్ప కళావేదికలో జరిగిన ఈ వేడుకకు.. పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులతో పాటు.. మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు. చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలకు వరుణ్ తేజ్ హాజరై మాట్లాడారు. చరణ్ తో చిన్నప్పుడు తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు చరణ్ ఎప్పుడూ తనను కొట్టేవాడని చెప్పారు. కానీ.. ‘చిరుత’ సినిమాతో ఆయనలో మంచి మెచ్యూరిటీ వచ్చిందని అన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ స్థాయి పెరిగిపోయిందని కొనియాడారు. ఇక స్క్రీన్ పై చరణ్ ను చూస్తుంటే.. అల్లూరి సీతారామరాజును చూస్తున్నట్టు అనిపించిందని మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. చరణ్ అన్నకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టంగా ఉందన్నారు.
ఇక ఇదే వేదికగా వరుణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. “చరణ్ అన్నను ఎవరైనా నోరెత్తి ఒక మాట మాట్లాడాలంటే మీరందరితో పాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి.. ఆ తరువాత ఆయనతో మాట్లాడొచ్చు” అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు వరుణ్ తేజ్. మరి ఆ వార్నింగ్ ఎవరికి అనేది ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.