అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా 95వ అకాడమీ అవార్డ్స్ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చరిత్ర సృష్టించిన విషయం విదితమే. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అందుకుని తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ‘నాటు నాటు’ సాంగ్ కి గానూ కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్ట్స్ అందుకున్నారు. ఆస్కార్ వేడుకల్లో డైరెక్టర్ రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ తోపాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొంది.
ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం అనంతరం ఇప్పటికే తారక్ హైదరాబాద్ చేరుకోగా.. శుక్రవారం ఉదయం జక్కన్న అండ్ టీమ్ సైతం హైదరాబాద్ వచ్చేశారు. వీరికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇక కాసేపటి క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ ఎయిర్ పోర్టులో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
అనంతరం చెర్రీ అక్కడ మీడియాతో మాట్లాడాడు. నాటు నాటు పాటను దేశ ప్రజలు బాగా ఆదరించారని, ఆ పాట తమ సినిమా పాట కాదని దేశ ప్రజలందరిదని.. అందరికీ ధన్యవాదాలను తెలిపాడు. కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్ లను చూసి తాము గర్విస్తున్నామని.. వారి వల్లే రెడ్ కార్పెట్ పై వెళ్లి భారత్ కు ఆస్కార్ తీసుకురాగలిగామని చెప్పాడు.
మరికాసేపట్లో మెగా హీరో రామ్ చరణ్.. ప్రధాని మోడీతో శుక్రవారం వేదికను పంచుకోనున్నాడు. ఓ ఛానెల్ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో రామ చరణ్ పాల్గొననున్నాడు. అనంతరం ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ కానున్నాడు చెర్రీ. వీరిద్దరితోపాటు.. ఆ కార్యక్రమంలో సచిన్, హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఎస్ జై శంకర్, కిరణ్ రిజిజు, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, పీ చిదంబరం ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.