రాంచరణ్ ఒక పక్క హీరోగా నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల బ్యానర్ ను ప్రారంభించి, చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ 150 సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఆ తరువాత సైరా నర్సింహా రెడ్డి సినిమాను కూడా కొణిదెల బ్యానర్ లోనే చరణ్ నిర్మించారు. ఇప్పుడు మళ్లీ కొరటాల దర్శకత్వంలో మెగా స్టార్ చేస్తున్న సినిమాను కూడా మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి చరణ్ నిర్మిస్తున్నారు. అయితే మెగా స్టార్ చిరంజీవితో కాకుండా ఇంకెవ్వరితో కొణిదెల బ్యానర్ లో సినిమాలు చెయ్యరా అంటే ససేమేర అన్న చరణ్ ఇప్పుడు రూట్ మార్చినట్టు కనిపిస్తుంది.
ఇప్పటికే లూసిఫర్, డ్రైవింగ్ లైసెన్స్ చిత్ర రీమేక్ రైట్స్ తీసుకున్న చరణ్… తన బ్యానర్ లో విక్టరీ వెంకటేష్ తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. దర్శకుడు ఎవరు అనేది ఇంకా అనుకోక పోయినా ఈ రెండు కథల్లో ఏ కథకు వెంకీతో సినిమా తీస్తారు అనేది ఆసక్తిగా మారింది. మరో వైపు ఈ రెండు కాకుండా ఇంకేమైనా కథను వెంకీ కోసం చరణ్ సిద్ధం చేస్తున్నాడా అనేది కూడా ప్రశ్నగా మారింది. ఈ సందేహాలన్నీ తీరాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.