విజయవాడలో చదువుతున్నప్పుడు ఎప్పుడూ.. దుర్గమ్మ దర్శనానికి రాలేదని.. కానీ కొండా దంపతుల వల్ల అది సాధ్యమైందని అన్నాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన నూతనంగా నిర్మిస్తున్న కొండా చిత్రం ప్రమోషనల్ లో భాగంగా విజయవాడ వెళ్లారు. అక్కడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని.. కాసేపు విలేకర్లతో ముచ్చటించారు.
‘‘కొండా దంపతుల భక్తి నన్ను ఎంతో ఆకర్షించింది. నేను నిర్మించిన వారి బయోపిక్ విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నా’’ అని తెలిపాడు వర్మ.
కొండా మురళీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్.. దాని గురించి ఐదారు చిత్రాలు నిర్మించిన సరిపోదని అన్నాడు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆర్జీవీ తమకు దేవుడు పంపిన దూతలా వచ్చి బయోపిక్ తీశారని చెప్పారు. ఇందులో కేవలం పది శాతం మాత్రమే తమ జీవితం ఉంటుందని స్పష్టం చేశారు.
ఏ శత్రువుకి రాని అనుభవాలు తాము అనుభవించామన్న ఆమె… అది నిజమో కాదో చిత్రం విడుదలైన తరువాత ప్రేక్షకులే చెబుతారని చెప్పారు. తన పాత్ర చేయడానికి కథానాయిక చాలా కష్టపడిందని… చిత్రం విజయవంతం కాగానే అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తామని తెలిపారు.