ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన వేళ.. ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలోని పలు అంశాల గురించి స్పందించారు. కాఫిర్, ఉమ్మా, జిహాద్ అనే మూడు భావనలతో గతంలో భారత్ పై దండయాత్రలు జరిగాయని.. ఇవి చాలా ప్రమాదకరమని అన్నారు.
కాశ్మీర్ లోయలో పండిట్ల హత్యపై స్పందిస్తూ.. బాధిత కుటుంబాల నిరసనలకు మద్దతుగా మాట్లాడారు. ప్రధానమంత్రి ఉపాధి ప్యాకేజీతో పండిట్లకు ఉపయోగం ఉన్నప్పటికీ… భద్రత ఎక్కడ ఉందని అన్నారు. కాశ్మీర్‌కు సంబంధించిన చర్చల్లో స్థానికులు పాల్గొనాలని చెప్పారు. ఎక్కడైనా ఏదైనా ఘటనలు జరిగినప్పుడు పోరాడేందుకు ఇక్కడ సరైన నాయకత్వం లేదన్న రామ్ మాధవ్.. తాము ఆ లోటును భర్తీ చేసేందుకు చూస్తున్నామని తెలిపారు.
ఇక వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశంపై మాట్లాడిన ఆయన.. రామజన్మభూమి విషయంలో అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చర్చలు జరపలేకపోయారని అన్నారు. ఆ అంశాన్ని కోర్టుకే వదిలేశారని.. జ్ఞానవాపి, మధుర ఇంకా ఇలాంటి చాలా ముఖ్యమైన కేసులు ఉన్నాయని వివరించారు. ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకాల్సిన అవసరం లేదన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘భగవత్ జీ జ్ఞానవాపి గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్ కానీ.. ఏ అనుబంధ సంస్థ ఏమీ డిమాండ్ చేయలేదు. ప్రజల నుండి డిమాండ్ వచ్చింది. ఇది ఇప్పుడు కోర్టు ముందు పెండింగ్ లో ఉంది. న్యాయ వ్యవస్థకు మరో దశాబ్దం పట్టవచ్చు. మనం కలసి వచ్చి పరిష్కరించగలమా? కలిసి రావడానికి, ఇది మధ్యయుగ ఇస్లామిక్ దండయాత్ర సమయంలో జరిగిందని ముస్లింలు అంగీకరించాలి. పరస్పరం మతపరమైన భావాలను మెచ్చుకోవాలి. ఒకసారి అది జరిగితే, హిందువులు పాత సమస్యలను తవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రతి మసీదులో శివలింగాన్ని చూడవలసిన అవసరం ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.
ఇస్లాం ఐదు విషయాలను చెబుతోందన్న రామ్ మాధవ్.. వాటి గురించి వివరించారు. మతం పట్ల విధేయత, రోజుకు ఐదుసార్లు నమాజ్, జకాత్ లేదా ప్రజల సంక్షేమం కోసం విరాళం, రంజాన్ సమయంలో ఉపవాసం, మక్కా లేదా మదీనాకు తీర్థయాత్ర చేయడం.. ఇలా వీటిని మాత్రమే అనుసరించాలని.. అప్పుడు ఈ దేశంలో ముస్లింలను ఎవరూ ఆపరని అన్నారు. అయితే.. కొందరు కాఫిర్, ఉమ్మా, జిహాద్ అనే మూడు భావనలతో ప్రవర్తిస్తున్నారని.. అది కరెక్ట్ కాదని చెప్పారు.