కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో రాజ్యాంగ నిర్మాత, డా. అంబేద్కర్, స్వాతంత్య్ర సమరయోధుడు సావర్కర్ లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత రామ్ మాధవ్ ఫైరయ్యారు. అసలు ఆ మహనీయుల గురించి మీకేం తెలుసు.. ఏం తెలియదు అని సూటిగా ప్రశ్నిస్తూ.. రాహుల్ కు సుదీర్ఘ లేఖ రాశారు. ఇటీవల మధ్యప్రదేశ్ లోని మాహోలో తన భారత్ జోడో పాద యాత్ర సాగుతుండగా.. రాహుల్.. అంబేద్కర్ పట్ల ఆర్ఎస్ఎస్ .. బూటకపు సానుభూతి చూపుతోందని, ఆయనకు ‘వెన్నుపోటు’ పొడిచిందని ఆరోపించారు. ( మాహో.. అంబేద్కర్ జన్మ స్థలం). అయితే మీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ‘ముందు నుంచే పోటు పొడిచిన’ విషయాన్ని మరిచిపోవద్దని మాధవ్ అన్నారు. ఆయన జీవించి ఉండగానే కాక.. మరణించిన తరువాత కూడా కాంగ్రెస్ నాయకత్వం ఆయనను అన్ని విధాలా ‘అవమాన పరిచే’ రీతిలో వ్యవహరించిందన్నారు.
1956 డిసెంబరు 6 న అంబేద్కర్ తుదిశ్వాస విడిచిన తరువాత రాజ్యసభలో ఆయనకు నివాళులర్పించిన సందర్భంగా నాడు జవహర్లాల్ నెహ్రూ … ఆయనను వివాదాస్పద వ్యక్తిగా పేర్కొన్నారని, ఎన్నో ఏళ్లుగా ఆయన వివాదాలకు మూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఏదో ఒక కారణంపై అంబేద్కర్ మీద కాంగ్రెస్ నాయకత్వం ఆయనను ఆడిపోసుకుంటూనే ఉందని.. . కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల తన వ్యతిరేకతను ఎన్నడూ చూపలేదని మాధవ్ అన్నారు.
పలు అంశాలపై గాంధీజీ, అంబేద్కర్ మధ్య విభేదాలు ఉన్న విషయాన్నీ ఆయన పేర్కొన్నారు. 1946 లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో అంబేద్కర్ ని చేర్చుకోవడానికి నెహ్రూ అయిష్ఠత వ్యక్తం చేశారు.. కానీ జగ్జీవన్ వంటి నేతలు జోక్యం చేసుకుని అంబేద్కర్ విషయంలో నెహ్రూ ని ఒప్పించారు. తనపట్ల నెహ్రూ ప్రదర్శించిన అవమానకర ధోరణిని ఆయన 1951 లో కేబినెట్ నుంచి చేసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు అని రామ్ మాధవ్ వివరించారు. 1990 లో నాడు బీజేపీ మద్దతుతో కొనసాగిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ..అంబేద్కర్ కు ‘భారత రత్న’ పురస్కారాన్ని ప్రకటించిందన్న విషయం మరిచిపోరాదన్నారు. హిందుత్వ గురించి మొట్టమొదట ఆయనే వ్యాఖ్యానించారన్నారు.
అంబేద్కర్, సావర్కర్ ఇద్దరూ హిందువుల్లో మతపరమైన ఛాందసవాదాన్ని వ్యతిరేకించారని, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఇది సబబేనని సమర్థించారని తెలిపారు. మొత్తానికి ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నారు. ఇటీవల సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రలో పెను దుమారం రేగిన విషయాన్ని రామ్ మాధవ్ ప్రస్తావించారు. ఇలాంటి స్వాతంత్య్ర సమర యోధుల గురించి మాట్లాడేటప్పుడు హుందాగా వ్యవహరించాలని, లేనిపోని విమర్శలు చేయరాదని రామ్ మాధవ్.. రాహుల్ కు సూచించారు.