కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేబట్టిన భారత్ జోడో పాద యాత్రకు అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మద్దతు ప్రకటించారు. మీకు సదా ఆ రాముని ఆశీస్సులు ఉంటాయన్నారు. మీరు చేస్తున్న ఈ యాత్ర జయప్రదం కావాలని, మీరు నిండు నూరేళ్లు జీవించాలని కోరుతున్నానంటూ ఆయన రాహుల్ కి లేఖ రాశారు. మీరొక మహత్తర ప్రయోజనం కోసం ఈ మిషన్ చేబట్టారని, ఇది ప్రజల సంతోషానికి దోహదం చేసేదేనని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
ఈ యాత్రలో పాల్గొనాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ తన ఆరోగ్య కారణాల రీత్యా రాలేకపోతున్నానని, కానీ నా నైతిక మద్దతు మీకు ఉంటుందని సత్యేంద్ర దాస్ వెల్లడించారు. సర్వజనుల సౌఖ్యం కోసం సాగుతున్న ఈ యాత్ర ఉదాత్తమైనదని ఆయన పేర్కొన్నట్టు అయోధ్య జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సునీల్ కృష్ణ గౌతమ్ తెలిపారు.
9 రోజుల బ్రేక్ అనంతరం రాహుల్ గాంధీ పాదయాత్ర మంగళవారం ఢిల్లీలో మళ్ళీ ప్రారంభమైంది. ఇది ఈ సాయంత్రం లేదా బుధవారం ఉదయం నాటికి ఉత్తర ప్రదేశ్ చేరగలదని భావిస్తున్నారు. ఈ నెల 6 న యాత్ర హర్యానాలో ప్రవేశిస్తుంది. 11 నుంచి 20 వరకు పంజాబ్ లో, 19 న ఒక్కరోజు మాత్రం హిమాచల్ లో , 21 న జమ్మూ కశ్మీర్ లో యాత్ర సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
తన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని రాహుల్ గాంధీ అన్ని పార్టీలను కోరుతున్నారు. ఈ ఆహ్వానం పట్ల సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.