గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు అన్నయ్యగా, కుష్బూ వదిన గా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు.
బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో ప్రభాస్, గోపీచంద్ పాల్గొన్న సందర్భంలో, బాలకృష్ణ ద్వారా చిత్రం పేరును ‘‘రామబాణం‘‘గా ప్రకటించారు. ఇప్పుడు అదే చిట్ చాట్ వీడియోతో టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారు. ‘లక్ష్యం, లౌక్యం సినిమాలను మించేలా ఇది ఉండబోతోంది.
ఈ సినిమాకి కథని భూపతి రాజా అందించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. 2023 వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.