రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి తారాస్థాయికి చేరేందని ఆరోపించారు టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 27 గ్రామాలకు చెందిన పంట భూములను ద్వంసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ అండగా నిలబడటంతో లాండ్ పూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారని పేర్కొన్నారు.
లాండ్ పూలింగ్ కారణంగా రాబోయే ఎన్నికల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని తెలిసి తాత్కాలికంగా నిలిపివేశారని వ్యాఖ్యానించారు. దీనిని మళ్ళీ చేపట్టే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లాండ్ పూలింగ్ పేరుతో ప్రజల నుండి లాక్కున్న భూమిని.. తిరిగి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారని ఆరోపించారు. అసైన్డ్ భూములు తీసుకున్న దానికి తగిన పారితోషకం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు.