– మహిళా ఎంపీపీకి పుట్టా మధు బెదిరింపులు
– వామనరావు దంపతులకు పట్టిన గతే మీకు!
– పార్టీకి నేనే దిక్కు..
– నీ దిక్కున్న చోట చెప్పుకో!
– పుట్టా మాటల్ని మీడియాకు వివరించిన ఎంపీపీ
– తమకు కేసీఆర్ యే దిక్కని వేడుకోలు
జిల్లా జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే కబ్జాలు, బెదిరింపులు, లాయర్ దంపతుల హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై సొంత పార్టీకి చెందిన మహిళా ఎంపీపీ తీవ్ర ఆరోపణలు చేశారు. తమను కాపాడాలంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు విజ్ఞప్తి చేశారు. పుట్టా మధు, పుదారి సత్యనారాయణల నుంచి ప్రాణహాని ఉందని.. వారి బారి నుంచి తమను కాపాడాలని రామగిరి మండలం ఎంపీపీ ఆరెల్లి దేవక్క దంపతులు వేడుకుంటున్నారు. ‘‘నేను, నా భర్త బీఆర్ఎస్ పార్టీలో గత 15 సంవత్సరాలుగా ఉంటున్నాం. పార్టీ కోసం, ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాం. ఎంపీపీ అయ్యినప్పటి నుండి మమ్మల్ని ఇక్కడ ఓడిపోయిన ఎంపీటీసీ పుదారి సత్యనారాయణ, నియోజకవర్గ ఇంఛార్జ్ పుట్టా మధు అనుచరులు నానా రకాలుగా ఇబ్బందికి గురిచేస్తున్నారు’’ అని ఎంపీపీ వాపోయారు.
మధు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వైస్ ఎంపీపీకి 10 లక్షలు ఇవ్వమన్నారని తెలిపారు. తనకు ఉన్న పొలం అమ్ముకొని మరి ఆ డబ్బులు ఇచ్చానని.. అప్పటినుండి పుదారి సత్యనారాయణ ఇతర ఎంపీటీసీలకు తన మీదకి ఉసిగొల్పి డబ్బులు ఇవ్వమని గొడవ పెట్టించి, చివరికి తనతో బ్లాంక్ చెక్ ఇప్పించారని వాపోయారు. తాను ఎంపీపీ అయ్యినప్పటి నుండి కక్ష కట్టి ప్రజాసేవ చేయడానికి అధికారుల సహకారం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రామగిరి మండలం మొత్తం తన అనుచరుడు సత్యనారాయణ గుప్పిట్లో పెట్టుకొని అధికారులను భయబ్రాంతులకు గురిచేసి తమ మీదకి ఉసిగొల్పి కొత్త జీవోలు అమలుచేశారని చెప్పారు. పార్టీలోని మిగతా ఎంపీటీసీలను బెదిరించి చెక్ బౌన్స్ కేసు ఫిర్యాదు చేయించారన్నారు. మహిళా ఎంపీపీ అని చూడకుండా సోషల్ మీడియాలో, తన ఆస్థాన పత్రికలో బూతు రాతలు రాయించారని వివరించారు. చెక్ బౌన్స్ కేసుపై జెడ్పీ ఆఫీస్ లో మాట్లాడుదాం అని పుట్టా మధు పిలిస్తే వెళ్లగా.. ఎవరికీ చెప్పుకోలేని రీతిలో బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీపీ. ‘‘నీకు కార్ ఎందుకే, తినడానికి దిక్కు లేదు. ఇవ్వన్నీ ఎందుకు’’ అంటూ పరుష పదజాలం వాడారని తెలిపారు.
తమకు ఎదురు తిరిగితే లాయర్ వామన్ రావుకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారని చెప్పారు. ‘‘నా సొంత అల్లుడిని జైలుకి పంపాను.. మీరు వాడికంటే గొప్పనా? నాకు అడ్డువస్తే ఎవడికైనా అదే గతి పడుతది’’ అని బెదిరించారని సంచలన ఆరోపణలు చేశారు దేవక్క. పోలీసులు తనవాళ్లు అని ఏం చెప్పినా వింటారని.. జైలులో ఉన్నవాళ్లు కూడా బయటకు రాని, పుట్టా మధు అంటే ఏంటో చూపిస్తానని అన్నారన్నారు. ‘‘కేసీఆర్, కేటీఆర్ ఏమీ చేయలేరు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారని మహిళా ఎంపీపీ వాపోయారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్ కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.