సంచలనం రేపిన పరువు హత్య కేసు వివరాల్ని మీడియాకు వివరించారు భువనగిరి పోలీసులు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రామకృష్ణను చంపింది మామే అని తేల్చారు. ఆర్నెళ్ల క్రితమే సుపారీ ఇచ్చాడని.. కాకపోతే రామకృష్ణకు కుమార్తె పుట్టాక వెనక్కి తగ్గాడని.. అయితే ఆస్తి కోసం అల్లుడు బెదిరింపులకు దిగడంతో చంపించాడని వివరించారు.
పోలీసుల కథనం ప్రకారం.. వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ హోంగార్డ్ గా ఉన్న సమయంలో యాదగిరిగుట్టకు చెందిన భార్గవిని ప్రేమించాడు. 2020 అగస్ట్ 16న పెళ్లి చేసుకున్నారు. లింగరాజుపల్లిలో కాపురం పెట్టగా.. భార్గవి గర్భవతి కావడంతో భువనగిరికి మారారు. రీసెంట్ గా ఓ పాప కూడా జన్మించింది. అయితే.. అన్నా.. అన్నా.. అంటూ తనవెంట తిరిగి తన కూతురినే వివాహం చేసుకోవడం వెంకటేష్ జీర్ణించుకోలేకపోయాడు. అదీగాక రామకృష్ణ, భార్గవి మధ్య ఏజ్ గ్యాప్ బాగా ఉండడం.. ఆస్తిలో హెచ్చుతగ్గుల వల్ల వెంకటేష్ కోపం పెంచుకున్నాడు.
లతీఫ్ అనే రౌడీషీటర్ ను కలిసి మర్డర్ స్కెచ్ వేశాడు. అందులో భాగంగానే ఈనెల 15న రామకృష్ణని రియల్ ఎస్టేట్ వ్యవహారంపై మాట్లాడాలని బయటకు పిలిపించి కిడ్నాప్ చేశారు. భువనగిరి నుంచి ఎత్తుకెళ్లిన నిందితులు అతన్ని చంపి లక్డారం కాలువలో పడేశారు. ఈ హత్య కోసం లతీఫ్ రూ.10 లక్షలు సుపారీ మాట్లాడుకున్నాడు. రూ.6 లక్షల సుపారీ అందింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న లతీఫ్ కేవలం డబ్బు కోసమే హత్యకు ఒప్పుకున్నాడు.
మరోవైపు పోస్టుమార్టం పూర్తయ్యాక రామకృష్ణ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. అతడి మృతదేహాన్ని చూసి భార్య భార్గవి బోరున విలపించింది. ఆ దృశ్యాలు అందరినీ కలచివేశాయి. ఇటు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, ప్రజాసంఘాలు ఆందోళనల బాట పట్టాయి.
పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తమపై పగ పెంచుకున్నారని.. అందుకే దూరంగా ఉంటూ వచ్చామని వాపోయింది భార్గవి. ఆస్తిలో ఒక్క పైసా వద్దని చాలాసార్లు చెప్పానని స్పష్టం చేసింది. తనకు ఆస్తి వద్దని సంతకాలు చేశానని కూడా తెలిపింది. గతంలో కిడ్నాప్ చేసి.. తనతో సంతకాలు తీసుకుని వదిలేశారని చెప్పింది. ఇప్పుడు తన కూతురు, అత్తకు దిక్కెవరని ప్రశ్నించింది. తన భర్తను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది భార్గవి.