ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాలయాల పరిస్థితులపై తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా దేవాలయాల పరిస్థితులపై ఆయన ట్విట్టర్ ట్వీట్ చేశారు. ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారంటూ పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారిందని తప్పుబట్టారు. ఆలయ అధికారులు సొంత ప్రణాళికలను అమలు చేస్తున్నారని, ఆలయాల్లో రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ట్విట్టర్ లో రమణ దీక్షితులు తప్పుబట్టారు.
కాగా సీఎం జగన్ ని విష్ణుమూర్తి ప్రతిరూపంగా రమణ దీక్షితులు అభివర్ణించారు. సనాతన ధర్మం అంతమవుతున్న దశలో విష్ణుమూర్తిలా జగన్ ధర్మాన్ని రక్షిస్తున్నారన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు జగన్ తిరుమల వచ్చారు. అయితే వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై జగన్, ప్రకటన చేస్తారని రమణ దీక్షితులు భావించారు.
జగన్ శ్రీవారిని దర్శించుకుని ఎలాంటి ప్రకటనా చేయకుండా వెళ్లిపోయారు. దీంతో నిరాశ చెందిన రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.