నటీనటులు: రవితేజ, దివ్యాంశా కౌశిక్, రాజీష విజయన్, వేణు, నాసర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, తదితరులు..
కెమెరా : సత్యన్ సూర్యన్ ఐఎస్‌సీ
మ్యూజిక్ : సామ్ సీఎస్
నిర్మాణం : ఎస్‌ఎల్‌వీ సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, ఆర్‌టీ టీమ్ వర్క్స్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం : శరత్ మండవ
నిడివి : 150 నిమిషాలు
రేటింగ్ : 2.25/5
ఒక మిస్సింగ్ కేసు. దాన్ని ఛేదించడానికి సిన్సియర్ పోలీసాఫీసర్ రంగంలోకి దిగుతాడు. సక్సెస్ ఫుల్ గా మిస్టరీని ఛేదిస్తాడు. కేసును క్లైమాక్స్ కు తీసుకొస్తాడు. మధ్యలో హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడు. ఈ ప్లాట్ తో సినిమాలు బహుశా వందల్లో వచ్చి ఉంటాయి తెలుగులో. అందుకేనేమో దర్శకుడు శరత్ మండవ కొత్తగా ఆలోచించాడు. పోలీస్ పాత్రను లేపేశాడు. ఆ స్థానంలో ఎమ్మార్వో కమ్ డిప్యూటీ కలెక్టర్ ను పెట్టాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే.. ఈ ఆలోచించిందేదో కథ, కథనంపై ఆలోచిస్తే బాగుండేది. ఇందులో పోలీస్ పాత్రను పెట్టినా, ప్రభుత్వ ఉద్యోగి పాత్రను పెట్టినా పెద్దగా తేడా లేదు. రవితేజ గత సినిమాల్నే మరోసారి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఎర్రచందనానికి మర్డర్ మిస్టరీని యాడ్ చేసి ఓ మంచి స్టోరీ అల్లుకున్నాడు శరత్ మండవ. అయితే.. ఈ స్టోరీ చుట్టూ మంచి సన్నివేశాలు కూడా రాసుకొని ఉంటే బాగుండేది. సీరియస్ గా సాగుతున్న కథలోకి సడెన్ గా పాటలు ఇరికించాడు. రవితేజ కోసం ఫైట్స్ పెట్టేశాడు. దీంతో కథలో గ్రిప్పింగ్ గాల్లో కలిసిపోయింది. సినిమా ఫలితం తేలిపోయింది. బాక్సాఫీస్ బరిలో నిరాశ మిగిలింది.
ఎమ్మార్వోగా పనిచేసే రామారావు (రవితేజ) రైతులకి అండగా నిలబడి ఓ కేసులో ఇరుక్కుంటాడు. దాని నుండి వెంటనే బయటపడి కొన్ని రోజులకే తన సొంత ఊరికి ట్రాన్స్ ఫర్ అవుతాడు. అలా చిత్తూరులో అడుగుపెట్టిన రామారావుకి తన మాజీ ప్రియురాలు మాలిని (రాజీష విజయన్) ఓ సమస్యలో ఉందని తెలుస్తుంది. అలాగే మాలిని భర్త మిస్సింగ్ కేసుపై శ్రద్ధ పెట్టి అసలు విషయం తెలుసుకోవాలని చూస్తాడు. అలా ఆ కేసుని ఛేదించేందుకు పర్సనల్ గా ఎంక్వైరీ మొదలుపెట్టిన రామారావు ఇంకా చాలా మంది మిస్సింగ్ లో ఉన్నారని తెలుసుకుంటాడు. అసలు చిత్తూరులో మిస్సయిన వ్యక్తులు ఎవరు? ఈ మిస్సింగ్ మిస్టరీని రామారావు ఎలా ఛేదించాడు? దాని వెనకుండి నడిపించిన డాన్ కి ప్రభుత్వ ఉద్యోగిగా ఎలా చెక్ పెట్టాడు… అనేది మిగతా కథ.
ఇదొక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్. సినిమా ఫార్మాట్ లోనే కాదు, వెబ్ సిరీస్ ఫార్మాట్స్ లో కూడా ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో, ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయిన వేళ, ఇలాంటి కథల్ని సీరియస్ గానే చెప్పాలి. పాటలు, ఫైట్స్ అంటూ మూసలోకి జారిపోకూడదు. శరత్ ఇంకా కొత్త ట్రెండ్ కు అప్ డేట్ అయినట్టు కనిపించలేదు. దీంతో ఈ సినిమా ఇటు కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ గా కాకుండా, అటు ఫక్తు కమర్షియల్ సినిమాలా కాకుండా మధ్యలో మాడిపోయిన కిచిడీ అయింది.
ఇలాంటి కథల్ని పోలీస్ ఫార్మాట్ లోనే చెప్పాలి. పోలీస్ కథ చెబితే హీరో రొటీన్ అంటాడేమోనని భయపడి, ఆ పాత్రను లేపేసి ప్రభుత్వ ఉద్యోగిగా మార్చేసినట్టు అనిపించింది. హీరోని పోలీస్ డిపార్ట్ మెంట్ వ్యక్తిగా కాకుండా, ఎమ్మార్వోగా చూపించాడు డైరక్టర్. సగం ఫెయిల్యూర్ కు బీజం అక్కడే పడింది. ఖాకీ యూనిఫాంతో ఇలాంటి కథలు చెబితే స్వేచ్ఛ తీసుకోవచ్చు. ఫైట్ చూపించినా, గన్ తో కాల్చినా చెల్లుతుంది. ఎమ్మార్వో ఫైట్ చేయడం వరకు ఓకే కానీ, తనే ఓ సీరియస్ పోలీస్ లా మారిపోయి కేసును ఇంచ్ టు ఇంచ్ పరిశోధిస్తుంటే కామెడీ అనిపిస్తుంది.
అయితే.. ఈ కిచిడీ కథలో కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎప్పట్లానే రవితేజ తన మార్క్ యాక్టింగ్, మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా బాగుంది. శ్యామ్ సీఎస్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ ఎపిసోడ్స్ మెప్పిస్తాయి. క్లైమాక్స్ కూడా బాగుంది. అలా అని ఈ రెండున్నర గంటల సినిమాను ఆసాంతం భరించడం మాత్రం కష్టం.