ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఈ సినిమాలోని నాటునాటు పాటకు ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా మరోసారి పండగ చేసుకుంది ఆర్ఆర్ఆర్ యూనిట్. ఈ క్రమంలో నాటు నాటు జ్ఞాపకాల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు యూనిట్ సభ్యులు. అదో అందమైన టార్చర్ అంటున్నాడు రామ్ చరణ్.
“నాటు నాటు పాట చిత్రీకరణలో, యాక్షన్ సీక్వెన్స్ లో దాదాపు అందరూ గాయపడ్డారు. దాని గురించి మాట్లాడటానికి ఇప్పటికీ నా మోకాళ్లు వణుకుతున్నాయి. అయినా చేశాం. అలాగే చేశాం. అది అందమైన టార్చర్. ఆ కష్టం, ఆ విధానం, లుక్ మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాయి. ఇక్కడ అందరి ముందు నిల్చుని మాట్లాడగలుగుతున్నామని అంటే దానికి కారణం ఆ కష్టమే.”
ఇలా నాటు నాటు షూటింగ్ నాటి కష్టాల్ని గుర్తుచేసుకున్నాడు రామ్ చరణ్. మనస్ఫూర్తిగా కష్టపడితే ఫలితం దక్కుతుందనడానికి ఆర్అర్ఆర్ సినిమానే నిదర్శనమని తెలిపాడు చరణ్.