నిజజీవితంలో ఇప్పటివరకు తండ్రి కాలేదు రామ్ చరణ్. అది ఆయన వ్యక్తిగతం. కానీ రీల్ లైఫ్ లో మాత్రం ఈ మెగా హీరో తండ్రిగా మారాడు. అతడి తండ్రి గెటప్ కూడా అదిరింది. అవును.. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో తండ్రి పాత్ర పోషిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ఒకటి తండ్రి పాత్ర.
ప్రస్తుతం ఈ తండ్రి పాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. చరణ్-అంజలిపై ఓ పాటతో పాటు, మరికొన్ని సన్నివేశాలకు తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా తండ్రి గెటప్ లో రామ్ చరణ్ సైకిల్ తొక్కుతున్న సన్నివేశం లీక్ అయింది కూడా. ఆన్-లొకేషన్ క్లిప్స్ లీక్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని నిర్మాత దిల్ రాజు ప్రకటించినప్పటికీ.. చరణ్-శంకర్ సినిమా లీకులు ఆగడం లేదు.
కెరీర్ లో తొలిసారి తను చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నానని చెప్పుకొచ్చింది నటి అంజలి. అప్పుడు ఆమె ఎందుకు ఆ స్టేట్ మెంట్ ఇచ్చిందో ఎవ్వరికీ అర్థంకాలేదు. రాజమండ్రి షెడ్యూల్ తో దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఆమె తల్లి పాత్రలో, వయసుమళ్లిన మహిళగా కనిపించబోతోంది. అందుకే అలా సింబాలిక్ గా ‘పెద్ద’ పాత్ర అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఇవాళ్టితో చరణ్-శంకర్ సినిమాకు సంబంధించి షెడ్యూల్ పూర్తయిపోతుంది. కొత్త షెడ్యూల్ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమా టోటల్ నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. జీ స్టుడియోస్ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరి, నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం దక్కించుకుంది. అటు థియేట్రికల్ బిజినెస్ లో కూడా జీ స్టుడియోస్ కు కొంత వాటా దక్కింది.