హారిక-హాసిని బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చర్చల దశలో ఉందే విషయాన్ని నిర్మాత నాగవంశీ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ మేటర్ ఇది. ఈ సినిమాలో చిరంజీవి కూడా ఉన్నారు. రామ్ చరణ్, చిరంజీవి తండ్రికొడుకులుగా కనిపించబోతున్నారు. ఈ మేరకు ఓ అందమైన లైన్ రాసుకున్నాడు త్రివిక్రమ్. దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది.
చిరంజీవి, చరణ్ కలిసి నటించడం కొత్త కాదు. మగధీర నుంచి మినిమం గ్యాప్స్ లో మెగా తండ్రికొడుకుల్ని తెరపై చూస్తూనే ఉన్నాం. రిలీజ్ కు రెడీ అయిన ఆచార్యలో కూడా చిరు-చరణ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఏకంగా తండ్రికొడుకులుగా కనిపించబోతున్నారు. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో.
ఫ్యామిలీ కథలకు కేరాఫ్ అడ్రస్ త్రివిక్రమ్. సున్నితమైన భావోద్వేగాల్ని అద్భుతంగా చూపించగల దర్శకుడీయన. ఇలాంటి దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు గతంలోనే చిరంజీవి ప్రకటించారు. కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడిలా త్రివిక్రమ్ దర్శకత్వంలో చరణ్ హీరోగా రాబోతున్న సినిమాలో చిరంజీవి కీలక పాత్ర పోషించబోతున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా టైమ్ ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఫోకస్ మొత్తం భీమ్లానాయక్ పై ఉంది. అది పూర్తయిన తర్వాత మహేష్ బాబు సినిమాను ఆయన కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే చిరు-చరణ్ సినిమా కథపై ఆయన కసరత్తు ప్రారంభిస్తారు. ఈలోగా చిరంజీవి-చరణ్ తమ కమిట్ మెంట్స్ పూర్తిచేస్తారు.