శంకర్ సినిమాలు చెక్కుతాడనే సంగతి అందరికీ తెలుసు. అందుకే రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా విడుదల తేదీపై అభిమానులు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే.. ఒక దశలో స్వయంగా యూనిట్, సంక్రాంతి రిలీజ్ అని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా అలర్ట్ అయ్యారు.
చెప్పినట్టుగానే సంక్రాంతి టార్గెట్ గా సినిమా షూటింగ్ పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు శంకర్, ఈ సినిమాకు గ్యాప్ ఇవ్వలేదు. దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. ఏదో ఒక షాట్ తీస్తూనే ఉన్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ మరింతగా ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదనేది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్.
అవును.. శంకర్-చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా సంక్రాంతికి రావడం లేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ప్రతి రోజూ షూటింగ్ జరుగుతున్నప్పటికీ, తీయాల్సింది ఇంకా చాలా ఉందట. దీంతో సంక్రాంతి డెడ్ లైన్ అందుకోవడం అసాధ్యం అని తేలిపోయింది. పైగా పోస్ట్ ప్రొడక్షన్ కు కనీసం 3 నెలలు టైమ్ కావాలని, టెక్నికల్ టీమ్ తో పాటు గ్రాఫిక్స్ టీమ్ డిమాండ్ చేసింది.
దీంతో ఇంకా పేరుపెట్టని చరణ్ సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించారు. ప్రస్తుతానికైతే సంక్రాంతికి చిరంజీవి భోళాశంకర్, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు మాత్రమే షెడ్యూల్ అయి ఉన్నాయి. మధ్యలో విజయ్ నటిస్తున్న వారసుడు, వైష్ణవ్ తేజ్ సినిమాల్ని సంక్రాంతి రిలీజ్ గా ప్రకటించినప్పటికీ డౌటే.